పరీక్షలు చేస్తరు.. రిపోర్టులు ఇస్తరు
జిల్లాకు 40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు
కరీంనగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీ త్వరలో పూర్తి కానుంది. జిల్లాకు 40 మంది కొత్తవారు రానున్నారు. మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం గతేడాది నవంబర్ 17న తుది జాబితా వెలువరించింది. ఈ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఒ ప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయనున్నారు. ఈ క్రమంలో నియామక ప్రక్రియలో 20 మార్కుల వెయిటేజీ కల్పించారు. ఎంపికైన అభ్యర్థులు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ పోస్టులకు జాయినింగ్ రిపోర్టులు అందజేయనున్నట్లు తెలిసింది.
పోస్టుల భర్తీ ఇలా..
జిల్లాలో ఖాళీగా ఉన్న 40 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద వీరిని నియమించింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నలుగురు, అనుబంధ జనరల్ ఆస్పత్రికి 18, వైద్య విధాన పరిషత్‌కు 9, వైద్యారోగ్యశాఖ పీహెచ్‌సీలకు 9 మందిని నియమించారు.
మరింత మెరుగైన వైద్య సేవలు
జిల్లాకు కొత్తగా 40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు మరింత పెరగనున్నాయి. నూతన నియామకాలతో ప్రతీ పీహెచ్‌సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను పూర్తిస్థాయిలో కేటాయించనున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారికి రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. రక్త పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు అందించే అవకాశం ఉంది. ప్రైవేటుకు వెళ్లకుండా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.


