ఎంఈవోల ప్రైవేటు దోస్తీ!
ప్రైవేట్ స్కూళ్ల విషయంలో వివాదాస్పదమవుతున్న వీరి తీరు
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు
టాలెంట్ టెస్ట్‌లపై మౌనంలో ‘మతలబు’ ఏమిటో?
పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్ముతున్నా చర్యలు శూన్యం
తనిఖీలు మరిచి ఎమ్మార్సీలకే పరిమితం
కరీంనగర్‌టౌన్: జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 15 మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలే పనిచేస్తున్నారు. ఎంఈవో ప్రమోషన్లలో నెలకొన్న సందిగ్ధతతో సీనియర్ హెచ్‌ఎంలను ఎంఈవోలుగా కొనసాగిస్తున్న విష యం తెలిసిందే. విద్యాసంవత్సరం ప్రారంభమై ఏడునెలలు గడుస్తున్నా ఏ ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేసిన దాఖలాలు అంతంతమాత్రమే. ఎమ్మార్సీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండలకేంద్రాల్లో అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నా చర్యలకు వెనకాడుతున్నారు. చాలా మంది ప్రైవేట్ స్కూళ్లకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ టెస్ట్‌లు విచ్చలవిడిగా నిర్వహించడం చూస్తుంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ, ఒలింపియాడ్ తదితరాల ముద్దు పేర్లను జోడించి యథేచ్ఛగా ప్రచారం నిర్వహిస్తున్న చూసీచూడన ట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు అమ్ముతున్న తీరును పసిగట్టిన విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు పాఠశాలల రూంలను సీజ్ చేసినా మళ్లీ తెరవడం గమనార్హం.
పుట్ట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు
జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో గతంలో ఒక్క పాఠశాలకు అనుమతి తీసుకొని అదే పేరున రెండుమూడు పాఠశాలలు నడిపిన సందర్భాలు ఉన్నాయి. అనుమతులు లేకుండానే జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్పొరెట్‌స్థా యి స్కూళ్ల విషయంలో మండల విద్యాధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారని అంటున్నారు.
అనవసర విషయాల్లో జోక్యం
ప్రభుత్వ పాఠశాలల పనితీరుతో పాటు అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై ఎంఈవోల ఆజమాయిషీ ఉంటుంది. కొందరు ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను వదిలి తమకు ఆదాయం వచ్చే విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నా యి. జిల్లాలో 654 ప్రభుత్వ, 800పైగా ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేక విద్యాశాఖ పరిస్థితి గందరగోళంగా మారిందన్న విమర్శలున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల వ్యవహారంలో జిల్లాలోని ఎంఈవో కార్యాలయాల్లో ముడుపుల వ్యవహారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ నాయకులు, డీఈవో కార్యాలయంలో కొంత మంది కలిసి ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం.
ఎంఈవోల ప్రైవేటు దోస్తీ!


