చిన్నారినిపై వీధికుక్క దాడి.. వైద్యానికి రూ.10లక్షల ఖర్చు.. అయినా దక్కని ప్రాణం

Dogs Road Side attack On girl - Sakshi

కరీంనగర్: అభం శుభం తెలియని చిన్నారి అందరాని లోకాలకు వెళ్లింది. తమ్ముళ్లను ఆడిపిస్తూ.. అల్లరిచేస్తూ.. ఇంటికి మహాలక్ష్మిగా భావించిన కూతురు ఇకలేదన్న నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పదిహేను రోజుల క్రితం కుక్కకాటుకు గురైన బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ ఘటన మానకొండూర్‌ మండలం పోచంపల్లి గ్రామంలో విషాదం నింపింది.

స్థానికుల వివరాల ప్రకారం.. పోచంపల్లి గ్రామానికి చెందిన కోమళ్ల చిరంజీవి– రజిత దంపతులు వ్యవసాయం, కూలీ పని చేస్తుంటారు. వీరికి కూతురు మహేశ్వరి(12), ఇద్దరు కొడుకులు సంతానం. మహేశ్వరి స్థానిక మోడల్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. పదిహేను రోజుల క్రితం తమ్ముళ్లతో ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి మహేశ్వరి చేతును కరిచింది. వెంటనే తల్లిదండ్రులు మండలంలోని వెల్ది ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఇంజక్షన్‌తో పాటు వారంరోజుల పాటు వైద్యం చేశారు.

వారం తరువాత మహేశ్వరికి జ్వరం వచ్చింది. వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి ఇన్‌ఫెక్షన్‌ సోకిందని చెప్పడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. మహేశ్వరి ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలకు పైగా అప్పు చేశారు. అయినా పరిస్థితిలో మార్పురాకపోవడం, విషమంగా మారడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మహేశ్వరి ప్రాణాలు వదిలింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top