బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో స్నానం చేస్తూ నీట మునిగిన ఓ మహిళను పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన బండమీది భోజమ్మ సోమవారం సాయంత్రం బాసరలోని గోదావరి ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ముత్తయ్య, చందు, సాయికృష్ణ నదిలో దూకి సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ దీపక్ 108కు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుమారుడు నరేందర్‌కు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించి ఓ ప్రాణాన్ని కాపాడిన పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.


