● అడ్లూర్ మెప్మా వరి కేంద్రం దుస్థితి
● దళారులకు అమ్ముతున్న రైతులు
కామారెడ్డి అర్బన్: మండలంలోని అడ్లూర్ గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించినా.. ఇప్పటికీ క్వింటాలు ధాన్యం కూడా కొనలేని దుస్థితి నెలకొంది. దీంతో రైతులు రైస్ మిల్లులు, దళారులు నిర్ణయించిన ధరకు అమ్ముకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నేటికి లొకేషన్ సాంకేతిక కారణాలతో ధాన్యం కొనుగోలు చేయలేదని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. రైస్ మిల్లులకు కాకుండా ప్రభుత్వ గోదాంలోకి ధాన్యాన్ని పంపుతున్నందున సమస్యలు వస్తున్నాయని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా దొడ్డు రకం వరి ధాన్యం రైస్ మిల్లులకు అమ్మితే టన్నుకు 15కిలోల తరుగుతోపాటు 42కిలోల బస్తాను 40కిలోలుగా తూకం లెక్కిస్తున్నారని, మద్దతు ధర కంటే తక్కువకు చీటి వేసి ఇస్తున్నారని, డబ్బులు ఇవ్వడానికి నెల రోజుల వాయిదా పెడుతున్నారని అడ్లూర్ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.


