సొంతూళ్లో తుదిశ్వాస విడుస్తా | - | Sakshi
Sakshi News home page

సొంతూళ్లో తుదిశ్వాస విడుస్తా

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

● ఉపాధి కోసం 18 ఏళ్ల క్రితం

ఇటలీ వెళ్లిన ఆర్మూర్‌వాసి

● క్యాన్సర్‌తో జీవిత చరమాంకంలో..

● స్వదేశానికి తీసుకువెళ్లాలని వేడుకోలు

ఆర్మూర్‌: ఉపాధి వేటలో 18 ఏళ్ల క్రితం ఇటలీకి వలస వెళ్లిన ఓ వ్యక్తి.. పరాయి గడ్డపై ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడ్డాడు. మృత్యువుతో పోరాడుతున్న అతడికి స్వదేశంలో బంధుమిత్రుల మధ్య తుది శ్వాస విడవాలన్నది చివరి కోరిక. ‘నన్ను మన ఆర్మూర్‌కు తీసుకెళ్లండి.. నా చివరి శ్వాస నా ఊరిలోనే విడవాలని ఉంది.. నా భార్య, నా పిల్లలు, నా మనవళ్ల మధ్యనే నేను కళ్లు మూయాలి’ అని వేడుకుంటున్నాడు ఆర్మూర్‌ పట్టణం పిప్రి గల్లీకి చెందిన పోల శంకర్‌.

కొలన్‌ క్యాన్సర్‌తో..

పోల శంకర్‌ కుటుంబం కోసం 18 ఏళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకుల పెళ్లిళ్ల కోసం 2013లో ఒకసారి, 2018లో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లాడు. 2018 తర్వాత తిరిగి స్వదేశానికి రాలేదు. అతడు కొంతకాలంగా కొలన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటలీలోని అవియానో పట్టణంలోని హాస్పిస్‌ వీయాడీ నటాలే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇంకో నెల రోజులకన్నా ఎక్కువ బతక్కపోవచ్చని వైద్యులు చెప్పడంతో శంకర్‌ మనసు సొంతవాళ్లమీదికి మళ్లింది. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సొంతూరుకు తీసుకువెళ్లాలని కోరాడు. శంకర్‌ పరిస్థితి తెలిసి అతడి భార్య లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ‘ఆయనను ఎలాగైనా మా ఊరికి తీసుకురండి‘ అంటూ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి సూచనతో ఈనెల 17న హైదరాబాద్‌ బేగంపేట ప్రజాభవన్‌లో ’సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి సహకారంతో సీఎం ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ కే.విద్యాసాగర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. స్వదేశానికి రాగానే అవసరాన్ని బట్టి హైదరాబాద్‌ లోని నిమ్స్‌ హాస్పిటల్‌ లో అడ్మిషన్‌ ఇప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ‘మా నాన్న జీవితమంతా మా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన మమ్మల్ని ఏమీ కోరడం లేదు. తన చివరి శ్వాసను సొంత ఊరైన ఆర్మూర్‌లో విడిస్తే చాలు అంటున్నాడు. దయచేసి ప్రభుత్వం స్పందించి మా నాన్నను ప్రాణాలతో స్వదేశానికి తీసుకురావాలి’ అని శంకర్‌ కుమారుడు అనిల్‌ కుమార్‌ కోరాడు.

లేఖలు రాశాం..

శంకర్‌ కుటుంబ సభ్యుల వినతిపై ప్రభుత్వం స్పందించిందని మంద భీంరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇటలీ మిలన్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌, ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖకు లేఖలు రాశామన్నారు. భారత ప్రభుత్వ ’మదద్‌’ పోర్టల్‌(కాన్సులార్‌ సర్వీసెస్‌ మేనేజ్మెంట్‌ సిస్టం – భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ)లో ’రిపాట్రియేషన్‌’ అనే కేటగిరిలో విజ్ఞప్తిని నమోదు చేశామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement