స్మార్ట్‌ కార్డుల పంపిణీ స్లో.. | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కార్డుల పంపిణీ స్లో..

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

బాన్సువాడ: ప్రజలకు మరింత పారదర్శకంగా రేషన్‌ సరుకులు అందించడంతో పాటు అక్రమాలకు చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించి నెలలు గడుస్తున్నా లక్ష్యాన్ని చేరడం లేదు. లబ్ధిదారులకు కార్డులు అందించే బాధ్యతను రేషన్‌ డీలర్లకు అప్పగించిన అధికార యంత్రాంగం పర్యవేణను విస్మరించింది. మరోవైపు కార్డుల్లో తప్పుల తడకగా వివరాలు ఉండటంతో లబ్ధిదారులు వాటిని తీసుకునేందుకు అంతా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

నెలలు గడిచినా..

ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీలో పారదర్శకతను తీసుకురావడం, రేషన్‌కార్డుల ట్యాంపరింగ్‌కు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో స్మార్ట్‌ కార్డులను అందించాలని నిర్ణయించింది. క్యూఆర్‌ కోడ్‌, హోలోగ్రామ్‌తో కూడిన డిజిటల్‌ కార్డులను సరఫరా చేస్తోంది. జిల్లాలో 9లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వంద శాతం పంపిణీ పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న స్మార్ట్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో, పట్టణాల్లో వార్డుల వారీగా కార్డులను స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. అయితే పంపిణీ ప్రారంభించి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు జిల్లాలో సగం కార్డులను మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్డుపై ఉన్న పేరు, నంబర్లను మినహాయిస్తే ఇతర వివరాలు సరిపోలనట్లు సమాచారం. గ్రామం, ఇంటి పేరు, హ్యాబిటేషన్‌, రేషన్‌దుకాణం నంబర్‌ తదితర వివరాలు కార్డుల్లో తప్పుగా ముద్రించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పర్యవేక్షణ లేక..

స్మార్ట్‌ కార్డుల పంపిణీ బాధ్యతలను అధికారులు రేషన్‌ డీలర్లకే అప్పగించారు. షాపుల వారీగా కార్డులు సరఫరా చేసిన సంబంధిత అధికారులు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడం లేదు. స్మార్ట్‌కార్డులు రాకముందే మూడు నెలల సన్నబియ్యం పంపిణీ పూర్తి కాగా, లబ్ధిదారులు వాటిని తీసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులు వస్తేనే ఇస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులు, డీలర్లు ఒకే తరహాలో వ్యవహరిస్తుండటంతో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

ప్రధానంగా బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతంలో సగం కూడా పంపిణీ జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

జిల్లాలోని మండలాలు 25

రెవెన్యూ డివిజన్లు 3

గ్రామాలు 532

రేషన్‌ దుకాణాలు 759

జిల్లాకు అందినకార్డులు 2.90 లక్షలు

స్మార్ట్‌ కార్డుల వివరాలు

ప్రారంభమై మూడు నెలలైనా

పూర్తికాని పంపిణీ

లబ్ధిదారులకు అందని స్మార్ట్‌ కార్డులు

కార్డుల్లో తప్పులతడకగా వివరాలు

అధికారుల పర్యవేక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement