సదాశివనగర్ : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు గిట్టుబాటు ధర బోనస్‌తో కలిపి టన్నుకు రూ.5వేలు చెల్లించాలని కామారెడ్డి కేన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(సీడీసీ) ఆధ్వర్యంలో చెరుకు రైతుల ప్రతినిధి బృందం రాష్ట్ర షుగర్ అండ్ కేన్ కమిషనర్ నర్సిరెడ్డిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దిన్ మాట్లాడుతూ...ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సాగు ఖర్చు, ఎరువులు, కూలీల ఖర్చులు, రవాణ వ్యయం పెరుగుదల తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ ఎడ్ల నర్సింలు, మాజీ విండో చైర్మన్ సదాశివరెడ్డి, సీనియర్ నాయకులు జనార్దన్, సిద్దిరాములు, విఠల్, బాల్‌రాజ్, రాజలింగం, గంగారాజం, భాస్కర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట : మండల కేంద్రంలో నిర్మిస్తున్న సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు ప్రముఖ వైద్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రాంరెడ్డి రూ. లక్ష విరాళంగా అందజేశారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై విరాళం ప్రకటించారు. పాఠశాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ప్రబంధకారిణి కమిటీ సభ్యులు, ఆచార్య బృందాన్ని అభినందించారు. 45 మంది విద్యార్థులు ఉన్న ఉపాఠశాలను నేడు 360 మంది విద్యార్థులను చదివిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. పాఠశాల అధ్యక్షుడు కొత్త దుర్గయ్య, శివ్వయ్య, లక్ష్మినారాయణ, బాపురెడ్డి, ప్రధాన మాతాజి సుమలత తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ : మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్‌తండా గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యుడు మెఘావత్ నరేశ్ బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. మాజీ జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, దూప్‌సింగ్ తండా సర్పంచ్‌్ కడావత్ శ్రీనివాస్ నాయకులు తదితరులున్నారు.
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్యాన్సీ, డ్రెస్, ఫుడ్ ఫెస్టివల్, ఆర్ట్‌అండ్ కల్చర్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఎల్లయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాల నళినీ దేవి, ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు హన్మాండ్లు, పాఠశాల ఉపాధ్యాయినీ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామారెడ్డి రూరల్: కోటాల్‌పల్లిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. వీబీజీరామ్‌జీ రూ. 12 లక్షల నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ ఆకుల శ్యామ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్, పంచాయతీ కార్యదర్శి దేవలక్ష్మి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట గ్రామసంఘం భవన నిర్మాణానికి బుధవారం సర్పంచ్ మన్నె వెంకటి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సహకారంతో గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ సాయికుమార్, ఐకేపీ ఏపీయం దత్తు, సీసీ రాజయ్య, కాంగ్రెస్ గ్రామకమిటీ అధ్యక్షుడు బోయిని హన్మాండ్లు, నాయకులు సాయాగౌడ్, నర్సింహారెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు.


