ధనదాహంతో..
● ప్రైవేటులో 85 శాతం సిజేరియన్లే..
● సర్కారు దవాఖానాల్లోనూ ఎక్కువే..
● ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వైద్యులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్లు చేసేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 85 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతుండగా.. సర్కారు దవాఖానాల్లోనూ సగం వరకు కోతలే నమోదవుతున్నాయి. పలువురు వైద్యులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, అవకాశం ఉన్నా సాధారణ కాన్పులు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే..
జిల్లాలో ఐదేళ్ల కాలంలో 93,168 కాన్పులు నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 74,858 కాన్పులు జరగ్గా.. ఇందులో 39,491 సాధారణ, 35,367 సిజేరియన్లు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 18,310 డెలివరీలు జరిగితే.. అందులో 15,688 సిజేరియన్లు, 2,622 సాధారణ కాన్పులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాభై శాతానికిపైగా సాధారణ కాన్పులు నమోదవుతుండగా.. ప్రైవేటులో 15 శాతం మాత్రమే సాధారణ కాన్పులు జరుగుతున్నాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
సిజేరియన్లతో ఎన్నో సమస్యలు...
కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మనీరు సమస్య, గర్భిణులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు బిడ్డను, తల్లిని కాపాడాలన్న ఉద్దేశంతో సిజేరియన్లు చేస్తుంటారు. అయితే కొన్ని ఆస్పత్రుల్లో నొప్పులొస్తున్నాయంటే చాలు అడ్మిట్ చేసుకుని సిజేరియన్ చేసేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సిజేరియన్లతో తల్లి బలహీనంగా మారడంతోపాటు నెల, రెండు నెలలు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు సిజేరియన్ అయిన వారికి కుట్లు సరిగా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్లు సోకడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
అధికారులు దృష్టి సారిస్తేనే..
అవసరం లేకున్నా అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తూ డబ్బులు దండుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాన్పు కోసం వెళ్లిన గర్భిణీకి ఏ పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని పరిశీలిస్తే ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారం బయటపడుతుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం ద్వారా సిజేరియన్లు జరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల ధనదాహంతో సిజేరియన్ ఆపరేషన్ల దందా విచ్చలవిడిగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగానికిపైగా సాధారణ కాన్పులు నమోదవుతుండగా.. ప్రైవేట్‌లో 15 శాతమే నార్మల్ డెలివరీలు ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది. సాధారణ ప్రసవం జరిగినపుడు అదే రోజు లేదంటే మరుసటి రోజు డిశ్చార్జీ చేస్తారు. సిజేరియన్ అయ్యిందంటే కనీసం ఐదారు రోజుల వరకు ఆస్పత్రిలో ఉండాల్సిందే. సాధారణ కాన్పుకు రూ.15 వేల నుంచి రూ. 30 వేల దాకా చార్జీ చేస్తుంటే.. సిజేరియన్లకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా తీసుకుంటున్నారు.


