కామారెడ్డి అర్బన్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఆదివారం జిల్లా గ్రంథాలయంలో రెండవరోజు పుస్తక ప్రదర్శనను సంస్థ జిల్లా చైర్మన్ ఎం.చంద్రకాంత్‌రెడ్డి ప్రారంభించారు. సాహిత్య, ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు నవలలు, ప్రముఖుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు, బాలసాహిత్యం, చందమామ పుస్తకాలను ప్రదర్శించారు.
కామారెడ్డి టౌన్: జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ రథాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తల్లి గడ్డం విజయలక్ష్మి ఈ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నపూర్ణ రథం నియోజకవర్గంలో పేదలకు నిరంతరం ఆహారం అందిస్తుందని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, కౌన్సిలర్ గడ్డమీది మహేష్, నాయకులు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణహరి, జూలూరి సుధాకర్, మెహర్ బాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి రూరల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు అన్నారు. చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సర్పంచ్ భీమాయల లక్ష్మీరాజు, ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు వడ్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీరాజా గౌడ్, మాజీ సర్పంచులు రామగౌడ్, ఆనందరావు, ఉప సర్పంచ్ స్వప్న లక్ష్మీనారాయణ, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: రైతులు వారికి సంబంధించిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని ఎల్లారెడ్డి సొసైటీ కార్యదర్శి విశ్వనాథం అన్నారు. ఆదివారం మండలంలోని గండిమాసానిపేట, అడివిలింగాల, బిక్కనూర్ గ్రామాలలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్నరకం వరి పండించిన రైతులు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి పంట పండించిన వివరాల సర్టిఫై కాపీని అందించాలన్నారు.


