ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబాన్ని కడతేర్చిన కేసులో..
నేరస్తులు తప్పించుకోలేరు
నేరాలకు పాల్పడేవారు తాము పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ పోలీసులు టెక్నాలజీ సాయంతో కేసులను ఛేదిస్తున్నారు. నేరాల్లో పాల్గొన్న వారెవరో కనిపెడుతూ.. వారిని పట్టుకుని ఆధారాలతో సహా కోర్టు ముందుంచుతున్నారు. ఈ ఏడాది 24 హత్య కేసుల్లో నిందితులకు శిక్షలు పట్టాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
2024 మార్చి 26న ఉదయం 7 గంటల ప్రాంతంలో పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన బోయ నవీన్ (23) తన ఆటోతో కామారెడ్డి వైపు వెళ్తుండగా రామేశ్వర్‌పల్లి శివారులో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కూరగాయలు కోసే కత్తితో చంపేశారు. గ్రామానికి చెందిన బోనగిరి మధు, ప్రభాకర్‌లపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి, వారిద్దరినీ రిమాండ్‌కు పంపించారు. వ్యక్తిగత విషయాల్లో నవీన్‌ప్రవర్తన నచ్చకపోవడంతో అతడి అడ్డు తొలగించుకున్నట్లు తేలింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
హత్య కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే బలమైన సాక్ష్యాలు అవసరం. ఒక్కోసారి నేరస్తులు తమ ఉనికి బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి సందర్భాల్లో సైతం పోలీసులు టెక్నాలజీ సాయంతో కేసులను ఛేదిస్తున్నారు. నేరాల్లో పాల్గొన్న వారెవరో కనిపెడుతూ, వారిని పట్టుకుని సాంకేతిక ఆధారాలతో సహా కోర్టు ముందుంచుతున్నారు. దీంతో నేరస్తులు చట్టానికి చిక్కుతున్నారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పకడ్భందీగా క్రోడీకరించి చార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నారు. దీంతో న్యాయస్థానాల్లో నేరం రుజువై నిందితులకు శిక్షలు పడుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 24 హత్య కేసులకు సంబంధించి తీర్పులు వెలువడ్డాయి. ఆయా కేసుల్లో ఒకరికి ఉరి శిక్ష పడగా, 34 మందికి జీవిత ఖైదు పడింది. ఆరుగురిని హతమార్చిన కేసులో ఏ 1 గా ఉన్న నిందితుడికి ఉరి శిక్ష ఖరారు కాగా.. మరో నలుగురికి జీవిత ఖైదు విధించారు.
హత్య కేసుల్లో పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టొద్దు. అలా అయితేనే నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కేసుల ఛేదనలో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సీసీ ఫుటేజీలు, వేలిముద్రలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ సాయంతో నేరస్తులను పట్టుకుంటున్నారు. తమదైన శైలిలో విచారణ జరిపి, తగిన సాక్ష్యాధారాలను కోర్టుముందు ప్రవేశపెడుతున్నారు. న్యాయమూర్తులు వాటిని పరిశీలించి శిక్షలు ఖరారు చేస్తున్నారు.
2023 ఏప్రిల్ 22న రాజంపేట గ్రామానికి చెందిన గంగు లింగం (42) సిద్దులగుట్ట ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. తన భర్త బయటకు వెళ్లి రాలేదని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉందంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఆమైపె అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. లింగంకు మద్యం తాగించి జనాలు తిరగని ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో భార్య లావణ్య, గోవింద్‌లు దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. ఇద్దరికీ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించింది.
2023 డిసెంబర్ 13న సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో 20 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని యువతి శవం దహనం చేయబడిన స్థితిలో కనిపించింది. పోలీసులు సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించగా.. ముందురోజు అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ వైపు నుంచి ఒక కారు వచ్చినట్టు గుర్తించి, దానిని అద్దెకు తీసుకున్న ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. తన స్నేహితుడైన ప్రసాద్ ఆస్తిని కాజేసేందుకు అతడితోపాటు అతడి ఇద్దరు చెల్లెళ్లు, భార్య, ఇద్దరు కవల పిల్లలను హతమార్చినట్టు విచారణలో తేలింది. ప్రశాంత్‌తో పాటు అతడికి సహకరించిన గుగులోత్ విష్ణు, ఒడ్డెమ్మలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసును విచారించిన కామారెడ్డిలోని న్యాయస్థానం ప్రధాన నిందితుడైన మెడిద ప్రశాంత్‌కు ఉరి శిక్ష, రూ.8 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. గుగులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మలకు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో పాలుపంచుకున్న మరో ఇద్దరు నిందితులు నేరం జరిగిన సమయానికి మైనర్లు కావడంతో వారిపై జువైనల్ కోర్టులో విచారణ జరుగుతోంది.
నేరం చేసిన వారు తప్పించుకోలేరు. అన్ని కేసుల్లో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, బలమైన సాక్ష్యాలను కోర్టు ముందుంచడం ద్వారా శిక్షలు పడుతున్నాయి. ఆరుగురిని హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష పడింది. పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా చూస్తుండడం అభినందనీయం.
– రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
సాంకేతిక ఆధారాలతో నేరస్తుల
ఆటకట్టిస్తున్న పోలీసులు
జిల్లాలో ఈ ఏడాది 24 హత్య కేసుల్లో
శిక్షలు ఖరారు
ఒకరికి ఉరి, 34 మందికి జీవితఖైదు
విధించిన న్యాయమూర్తులు


