బాన్సువాడ: పట్టణంలో ఇటీవల తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తుల శ్రీధర్ అన్నారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బస్టాండ్‌లో ఈనెల 10న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఒకరిని జుక్కల్‌కు చెందిన జాదవ్ రాహుల్‌గా గుర్తించగా, మరొకరిని భైంసాకు చెందిన సందీప్‌గా గుర్తించారు. రాహుల్ గతంలో భైంసాలో కూలీపనులకు వెళ్లగా, సందీప్‌తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఇరువురు కలిసి తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుండేవారన్నారు. కొన్నిరోజుల క్రితం బాన్సువాడలోని శాంతినగర్, హరిజనవాడ కాలనీల్లో తాళాలు వేసిన ఇళ్లలో ఇరువురు కలిసి 9.8 తులాల బంగారు ఆభరణాలు, 29.7 తులాల వెండిని అపహరించుకుపోయినట్లు అంగీకరించారన్నారు. వాటిలో బంగారు ఆభరణాలను సందీప్, మరోవ్యక్తి షాదాబ్‌లతో కలిసి పట్టణంలోని ఓ ప్రైయివేట్ బ్యాంకులో గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టారన్నారు. దీంతో వారి వద్ద నుంచి 29.7 తులాల వెండి ఆభరణాలను, తాకట్టులో ఉన్న 9.8 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రాహుల్‌తోపాటు సహకరించిన సందీప్‌ను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న షాబాద్‌ను త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.


