మొబైల్ ఫోన్ల చోరీ, దోపిడీలు.. బాలుడి పట్టివేత
కామారెడ్డి టౌన్: రూ.10 వేల అప్పు తీర్చేందుకు ఏటీఎం యంత్రాన్ని బద్దలు కొట్టి నగదు దోచుకోవాలని పథకం వేసిన ఓ వ్యక్తి, సైరన్ మోగడంతో పోలీసులకు గంటల వ్యవధిలోనే చిక్కాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లాకు చెందిన మహేశ్ జ్ఞానోబా బిందే (33) పట్టణంలోని వాల్మీకి బ్యాండ్‌షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరి వద్ద తీసుకున్న రూ.10 వేల అప్పు తీర్చేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇనుప రాడ్‌తో జేపీఎన్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుగా అక్కడున్న సీసీ కెమెరాలను తొలగించి తన వెంట తీసుకున్నాడు. అనంతరం ఇనుప రాడ్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు తీసేందుకు ప్రయత్నించగా, ఒక్కసారిగా సెక్యూరిటీ అలారం మోగింది. దీంతో భయాందోళనకు గురైన మహేశ్ డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు.
రైల్వేస్టేషన్‌లో పట్టివేత
ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని బ్యాండ్ షాపులో పనిచేసే మహేశ్‌గా గుర్తించారు. నేరం చేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పట్టణంలోనే తలదాచుకున్న నిందితుడు, గురువారం స్వగ్రామానికి పారిపోయేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్, ఏటీఎం నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాలు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా, నిందితుడిని వేగంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నర్సింలు, హోంగార్డు మోహన్ రెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తరుచూ ఎస్‌బీఐ ఏటీఎంలో ఘటనలు జరుగుతుండటంతో సంబంధిత బ్యాంక్ అధికారులకు నోటీసులు జారీ చేసి అవగాహన కల్పించామన్నారు. సీసీ కెమెరాలు, సైరన్ మోగడంతో నిందితుడిని పట్టకోవడం సులభమైందని ఎస్పీ తెలిపారు.
ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకొని సెల్‌ఫోన్ల చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు, ఒకరి ఫోన్‌ను దొంగిలించగా, మరొకరిపై వెనుక నుంచి దాడి చేసి, బెదిరించి మరో ఫోన్‌ను బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు, బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. బాలుడు గతంలోనూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల ఫోన్లు దొంగిలించి తక్కువ ధరకు విక్రయించినట్లు తెలిసింది. బాలుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఏటీఎంలో చోరీకి యత్నం..
సెక్యూరిటీ అలారం మోగడంతో పరార్
గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
వివరాలు తెలిపినఎస్పీ రాజేశ్‌చంద్ర


