బల్దియా సమావేశం సజావుగా సాగేనా? | - | Sakshi
Sakshi News home page

బల్దియా సమావేశం సజావుగా సాగేనా?

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

ఎజెండాలోని అంశాలు..

అక్రమాల ఆరోపణలపైనే..

కామారెడ్డి టౌన్‌: అవినీతి ఆరోపణలు.. అదనపు కలెక్టర్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల కలవరం..మరోవైపు అభివృద్ధి పనులు జరగడం లేదన్న కౌన్సి లర్ల అసంతృప్తి.. వెరసి నేడు జరగనున్న కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బల్దియాలో అభివృద్ధి కుంటుపడిందంటూ కౌన్సిలర్లు నిరాశలో కూరుకుపోగా, అక్రమాల అస్త్రాలతో అధికార పక్షాన్ని కట్టడి చేసేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి.

అభివృద్ధిపై..

బల్దియా సమావేశంలో అధికార పక్షాన్ని, అధికారులను నిలదీసేందుకు ప్రతిపక్ష, మిత్రపక్షమైన బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. 10 నెలల కాలంలో చేసిన అభివృద్ధి పనులేమిటో సభలో స్పష్టంగా వివరించాలని బీజేపీ కౌన్సిలర్లు పట్టుబట్టనున్నారు. అదనపు కలెక్టర్‌ విచారణలో తేలిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేయనున్నారు. మరోవైపు పార్టీలకతీతంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనులు సాగడం లేదని తీవ్ర నిరాశలో ఉన్నారు. కనీసం వీధి దీపాలు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎజెండా అంశాలతోపాటు ఆరోపణలు, నిలదీతలతోనే సమావేశం జరిగే అవకాశాలున్నాయి. అయితే ఎక్స్‌అఫీషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమావేశానికి హాజరైతే సజావుగా సాగేలా చూస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్‌ సమావేశంలో 40 ఎజెండా అంశాలను కౌన్సిల్‌ ముందుంచుతున్నారు. వీటిలో 2020–25 మధ్య చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు రూ.4.40 కోట్ల పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, వాహనాలకు డీజిల్‌ ఖర్చులు (రూ.1.56 కోట్లు), స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌, కోతుల బెడద నివారణ (రూ.10 లక్షలు), ఫాగింగ్‌ మిషన్‌, బయోమెట్రిక్‌ పరికరాల కొనుగోలు, నిలిపివేసిన ప్రకటనల ఫీజులను మూడు రెట్లు పెంచి తిరిగి వసూలు చేయడం, తైబజార్‌ వేలం పొడిగింపు, నిజాంసాగర్‌ చౌరస్తాలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు, చైర్‌పర్సన్‌, కమిషనర్‌ వాహన భత్యాల చెల్లింపు, చెత్త సేకరణ వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇటీవల కామారెడ్డి బల్దియాలో చోటు చేసుకున్న పలు అక్రమాలు, అవినీతి ఆరోపణలు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. టేక్రియాల్‌లో వినాయక నిమజ్జన విగ్రహాల స్క్రాప్‌ మాయం, భవన నిర్మాణాలపై వసూళ్లు, రూ. 80 లక్షల పంపకాలు, నిధుల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలకు సహకారం, పనుల కేటాయింపుల్లో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులకు కలెక్టర్‌ స్పందించి, అదనపు కలెక్టర్‌ ఎన్‌.వై. గిరిని విచారణ అధికారిగా నియమించారు. దీంతో స్వయంగా విచారణ చేపట్టిన ఆయన, అకౌంటెంట్‌ విభాగం మినహా అన్ని విభాగాల అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం బల్దియాలో కలకలం రేపింది. నేటి సమావేశంలో ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

నేడు భేటీ కానున్న కామారెడ్డి

మున్సిపల్‌ కౌన్సిల్‌

40 ఎజెండా అంశాలు..

అధికార పక్షాన్ని ఇరుకున

పెట్టేందుకు అస్త్రాలతో విపక్షాలు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement