ఉన్ని దుస్తులకు గిరాకీ
జిల్లాలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలు
జిల్లాపై చలి పులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజామున వీస్తున్న ఈదురు గాలులు, కమ్ముకుంటున్న దట్టమైన పొగమంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● రాంలక్ష్మణ్‌పల్లిలో 12.7 డిగ్రీలు
● పడిపోయిన ఉష్ణోగ్రతలు
● జిల్లా అంతటా పెరిగిన చలి తీవ్రత
అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న రాంలక్ష్మణ్‌పల్లి గ్రామం
జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలితీవ్రత పెరిగింది. రెండు మూడు రోజులుగా సాయంత్రం అయ్యిందంటే రోడ్లపై తిరగడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటే వరకు చలి వదలడం లేదు. జిల్లా అంతటా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లి గ్రామంలో 12.7 డిగ్రీలు నమోదైంది. ప్రతీ ఏడాది రాంలక్ష్మణ్‌పల్లిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కాగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 13.1 డిగ్రీల నుంచి 15.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 18.2 డిగ్రీలు నమోదైంది. చిన్నపిల్లలు, వృద్ధులు చలితో గజగజ వణుకున్నారు. చాలా మంది జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జిల్లాలోని గాంధారి, డోంగ్లీ, పాల్వంచ, మాచారెడ్డి, మద్నూర్, జుక్కల్, బీబీపేట, బిచ్కుంద, లింగంపేట, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్, దోమకొండ, బీర్కూర్, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్ తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చలి తీవ్రత పెరుగుతుండడంతో మార్కెట్‌లో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. గతేడాది పెద్దగా చలి లేకపోవడంతో ఉన్ని దుస్తుల వైపు వెళ్లలేదు. ఈసారి చలి తీవ్రత పెరుగుతుండడంతో చాలా మంది స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు కొనుగోలు చేస్తున్నారు. బ్లాంకెట్ల అమ్మకాలూ పెరుగుతున్నాయి. చిన్న పిల్లలు చలితో ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఉన్ని దుస్తులను కొంటున్నారు. ఖరీఫ్ వరి కోతలు నడుస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిద్ర చేయాల్సిన పరిస్థితుల్లో చలి నుంచి కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రాంతం ఉష్ణోగ్రత
రాంలక్ష్మణ్‌పల్లి 12.7
డోంగ్లీ 13.1
ఎల్పుగొండ 13.2
లచ్చాపేట్ 13.3
సోమూర్ 13.7
మేనూర్ 13.8
సర్వాపూర్ 14.1
జుక్కల్ 14.2
బీబీపేట 14.2
బిచ్కుంద 14.3
లింగంపేట 14.3
ఇసాయిపేట 14.3
మాచాపూర్ 14.4
నస్రుల్లాబాద్ 14.6
గాంధారి 14.6
దోమకొండ 14.6
బీర్కూర్ 14.6
బొమ్మన్‌దేవ్‌పల్లి 14.9
కొల్లూరు 15.1
మగ్ధుంపూర్ 15.1
పిట్లం 15.1
పెద్దకొడప్‌గల్ 15.1
పుల్కల్ 15.2
భిక్కనూరు 15.2
పాతరాజంపేట 15.3
హసన్‌పల్లి 15.5
బంజరతండా 15.7
రామారెడ్డి 15.9
తాడ్వాయి 17.6
ఆర్గొండ 17.6
సదాశివనగర్ 17.9
కామారెడ్డి కలెక్టరేట్ 18.2


