బిర్సా ముండా పోరాటం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

బిర్సా ముండా పోరాటం చిరస్మరణీయం

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

● 15న జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి టౌన్‌ : గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో పోరాడిన భగవాన్‌ బిర్సా ముండా సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈనెల 15న నిర్వహించే జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్‌లో వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నవంబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు రూపొందించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాలల్లో క్విజ్‌, క్రీడా, సాంస్కృతిక పోటీలు, హస్తకళల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 6 వేల మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన గాంధారి మండల గురుకుల విద్యార్థిని బాబ్లీని, దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత, ఆర్మీ సుబేదార్‌ రవీందర్‌ను, పారా కై ్లంబింగ్‌, యోగాలో జాతీయ, రాష్ట్ర స్థాయి స్వర్ణ పతకాలు సాధించిన ఖుషిలను కలెక్టర్‌ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్‌, ఎన్‌.వై. గిరి, డీఆర్వో పాండు, గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనకు

ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌– డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి అవును చెప్పండి’ అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..మాదకద్రవ్యాల వినియోగం యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు.సమాజ శ్రేయస్సు కోసం రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో మల్లికార్జున్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, రాష్ట్ర ఎం.సి. సభ్యుడు జైపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి

భూముల రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో రీసర్వే పనుల పురోగతిపై గురువారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిరోజూ చేపడుతున్న సర్వే పనుల పురోగతిని సమీక్షించాలని, రోవర్‌ పరికరాల పనితీరు, వాటి వినియోగం, సర్వే బృందాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలోని 70 కాడాస్ట్రల్‌ రీసర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అనంతరం జాప్యం లేకుండా వెంటనే సర్వే పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం 50 బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బృందానికి ఒక సర్వేయర్‌ను కేటాయించి పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, ఎన్‌.వై. గిరి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి శ్రీనివాస్‌, ఏవో మసూద్‌ అహ్మద్‌, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement