నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): యాసంగి సాగుపై పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం పోచారం ప్రాజెక్టు నీటిని ఈ యేడు యాసంగి సీజన్‌లో ‘ఏ’జోన్‌కు కేటాయించాల్సి ఉంది. కానీ ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు యాసంగి సాగు పూర్తయ్యే వరకు సరిపోదనే దిగాలు రైతుల్లో నెలకొంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులతో 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం పోచారం ప్రాజెక్టులో 14.5 అడుగులతో 0.942 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఈసారి సరైన వర్షాలు లేక ప్రాజెక్టులో వరద చేరలేదు. దీంతో ప్రాజెక్టులో ఉన్న నీటి ద్వారా ఆయకట్టు పరిధిలోని ‘ఏ’, ‘బీ’ జోన్లలో వానాకాలం పంటల సాగును చేపట్టారు. దీంతో ప్రాజెక్టులోని నీటిమట్టం భారీగా పడిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని యాసంగి పంటలు పూర్తిస్థాయిలో సాగయ్యే వరకు ఇవ్వలేమని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంటల సాగు ప్రారంభంలో బోర్లపై ఆధారపడితే చివరలో రెండు తడులుగా ప్రాజెక్టు నీటిని అందించగలమని వారు చెబుతున్నారు. ఆయకట్టు పరిధిలో వరి కాకుండా ఆరుతడి పంటలు సాగుచేస్తే ప్రాజెక్టులోని నీరు సరిపోయే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ప్రాజెక్టులో 0.942 టీఎంసీల నీరు
ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు నాలుగైదు తడులు అవసరం
రెండు తడులకే సరిపడే నీరు
ఆందోళనలో ఆయకట్టు రైతులు


