దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

● ఇప్పటికే వారిపై పలు స్టేషన్లలో

దొంగతనాలు, హత్యాయత్నం కేసులు

● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర

కామారెడ్డి టౌన్‌: కూలీ పని పేరుతో నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పట్టణ పో లీసులు అరెస్ట్‌ చేశారు. కామారెడ్డిలోని జిల్లా పో లీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ రాజేశ్‌చంద్ర వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన మేసీ్త్ర నీరడి భూమేష్‌ (40) ఈనెల 10న కూలీల కోసం జేపీఎన్‌ చౌక్‌ వద్దకు వెళ్లగా, బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన కడమంచి లక్ష్మి అలియాస్‌ హైమద్‌ బీ (35) పరిచయమైంది. కూలి పనికి వస్తానని నమ్మించిన ఆమె, ముందుగా ఉగ్రవాయి మైసమ్మ ఆలయానికి వెళ్దామని చెప్పడంతో భూమేష్‌ బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ భోజనం చేస్తుండగా, ముందస్తు పథకం ప్రకారం ఆర్‌బి నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ అల్లం శివకుమార్‌ (25) ఆటోలో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి భూమేష్‌ను చంపేస్తామని బెదిరించి రూ.900 నగదు, మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి ఈనెల 11న జేపీఎన్‌ చౌరస్తా సమీపంలో నిందితులు లక్ష్మి, శివకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. వీరిపై కామారెడ్డి, దేవునిపల్లి, మేడ్చల్‌ స్టేషన్లలో పలు దోపిడీ, దొంగతనం, హత్యాయత్నం కేసులు ఉన్నట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.900 నగదు, రెండు ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement