● 50 మంది విద్యార్థులకు
ఇస్రో సందర్శనకు అవకాశం..
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించి, వారిని పరిశోధనల వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లాలోని విద్యార్థులకు ఇస్రోను సందర్శించే అరుదైన అవకాశం కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో పోటీ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన పోటీల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో ఎంపికైన 50 మంది విద్యార్థులతో పాటు 30 మంది ఉపాధ్యాయులను ఇస్రో సందర్శనకు పంపించామని పేర్కొన్నారు. ఈ విద్యా పర్యటన ద్వారా అంతరిక్ష విజ్ఞానం, ఉపగ్రహ ప్రయోగాలు, శాస్త్ర సాంకేతిక పురోగతిని వారు ప్రత్యక్షంగా వీక్షించి ఎంతో నేర్చుకున్నారన్నారు.
ఈ ఏడాది నిర్వహించిన ఇస్రో క్విజ్ పరీక్షకు జిల్లాలో 772 మంది విద్యార్థులు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులతోపాటు 30 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఇస్రో పర్యటనకు పంపిస్తామన్నారు. ఇకపై ఏటా రెండుసార్లు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, మరిన్ని ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థల సందర్శనకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, డీఈవో మల్లికార్జున్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


