పెద్దకొడప్గల్(జుక్కల్): సోయాబీన్‌తోపాటు మోటారు సైకిల్‌ను దొంగిలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. మండలంలోని కాస్లాబాద్ గ్రామానికి చెందిన సోంటికె నారాయణ అదే గ్రామానికి చెందిన రైతు చౌదరి అనంతరావు ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన రెండు సోయాబీన్ సంచులను ఈ నెల 28న రాత్రి దొంగిలించాడు. నిందితుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నప్పటికీ ఈ మధ్య మద్యపానం, విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన సోయాబీన్ సంచులను శనివారం పిట్లం ప్రాంతంలో విక్రయించేందుకు మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తుండగా బేగంపూర్ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. అయితే ఏడు నెలల క్రితం జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో మెకానిక్ షాపు ఎదుట పార్క్ చేసిన మోటార్ సైకిల్‌ను నారాయణ దొంగిలించి, నంబర్ ప్లేటును తొలగించి ఉపయోగిస్తున్నాడని ఎస్సై తెలిపారు. సోయాబీన్‌తోపాటు మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


