ఎవరికి వారే.. యమునా తీరే! | - | Sakshi
Sakshi News home page

ఎవరికి వారే.. యమునా తీరే!

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

ఎవరికి వారే.. యమునా తీరే! చైర్‌పర్సన్‌ భర్తపై ఆరోపణలు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రూపు రాజకీయాలు..

గాడిన పెట్టేదెవరు?

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పార్టీలు వేరైనా ప్రజల సమస్యలపై కలిసి పనిచేయాల్సిన మున్సిపల్‌ పాలక వర్గం.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా తయారయ్యింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పోటీ పడాల్సిన కౌన్సిలర్లు.. గ్రూపులుగా, పార్టీలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. అధికారులు కూడా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో కామారెడ్డి పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతోంది.

మున్సిపల్‌ కౌన్సిల్‌పై చైర్‌పర్సన్‌ భర్త అజమాయిషీ చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై చైర్‌పర్సన్‌ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఎదురుదాడికి దిగారు. ఇంకో వైపు పట్టణ అభివృద్ధి నిధుల కేటాయింపు, పండుగల సందర్భంగా సౌకర్యాలు కల్పించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చెత్త సేకరణ, మురికి కాలువలు శుభ్రం చేయడం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ విషయంలో మున్సిపల్‌ పాలక వర్గం, అధికారులు తమ బాధ్యత కాదన్నట్టే వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో చాలా ప్రాంతాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. చెత్త సేకరణ ఆటోలు సరిగా రాకపోవడంతో చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. మున్సిపల్‌లో సిబ్బంది సరిపడకపోవడంతో చాలాచోట్ల చెత్త దర్శనమిస్తోంది. అలాగే డ్రెయినేజీలు శుభ్రం చేయడం కూడా సమస్యగా మారింది. కొన్ని వార్డుల్లో అవగాహన ఉన్న కౌన్సిలర్లు అధికారులను మేనేజ్‌ చేసుకుని తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించుకుంటుండగా, చాలా వార్డుల్లో చెత్త సమస్య, డ్రెయినేజీల సమస్య ఇబ్బంది పెడుతోంది. విద్యుత్‌ దీపాలు చెడిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రధాన రహదారులపై వీధి దీపాలు నెలల తరబడిగా వెలగడం లేదు. వినాయక చవితి, దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగానూ సరైన ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మున్సిపల్‌ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు గడిచాయి. అయితే కౌన్సిల్‌లో ఆధిపత్యం కోసం ఎవరికి వారే ఆరాటపడుతున్నారు. మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నిధుల నుంచి ఒక్కో వార్డుకు రూ.6 లక్షల చొప్పున మొత్తం 49 వార్డులకు నిధులు కేటాయిస్తూ చేసిన తీర్మానాన్ని అందరూ ఆమోదించారు. అయితే నెలలు గడుస్తున్నా నిధులు కేటాయించలేదు. దీంతో చైర్‌పర్సన్‌కు, కౌన్సిల్‌ సభ్యులకు మధ్య వివాదం పెరుగుతూ వస్తోంది. అధికార పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌కు, అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మధ్య విబేధాలు పెరిగాయి. దీంతో కొందరు కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌కు వ్యతిరేక గ్రూపుగా ఏర్పడ్డారు. కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు మూడు గ్రూపులుగా విడిపోవడం గమనార్హం.

మున్సిపల్‌ పాలక వర్గం గ్రూపులుగా విడిపోయి పాలన గాడితప్పి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో స్థానిక ముఖ్య నేతలు, జిల్లా అధికారులు చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) మున్సిపల్‌ విషయంపై దృష్టి సారించడం లేదు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో జరుగుతున్న వ్యవహారాన్ని సరిదిద్దేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ప్రయత్నించిన పాపాన పోవడం లేదు. పాలనను గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

కామారెడ్డి బల్దియాలో

ఎవరికీ పట్టని అభివృద్ధి

గ్రూపులుగా విడిపోయిన కౌన్సిలర్లు

ఆధిపత్యం కోసం ప్రయత్నాలు

ప్రజల సమస్యలు గాలికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement