కామారెడ్డి టౌన్ : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పథకాల పురోగతి, ఎల్‌నినో ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో పచ్చిమేత కొరత రాకుండా వీబీజీ రాంజీ పథకం ద్వారా పశుగ్రాస సాగును ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారునికి గరిష్టంగా ఎకరం వరకు ఐదు రకాల గడ్డి విత్తనాలను సాగు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, పీఎంఏవై–జీ లబ్ధిదారుల జాబ్ కార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి గిరిజన ప్రాంతాల్లో అనుమతులు వేగవంతం చేయాలని సూచించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, భూ పునఃసర్వే లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. సింగూరు జలాశయం నుంచి తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, జిల్లా హౌసింగ్ అధికారి విజయపాల్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రమేష్, డీఎఫ్‌వో సూరజ్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


