రాత్రయితే నరకమే..
ప్రయాణికుల కష్టాలు తీరేదెలా?
నిల్చోవడానికీ ఇబ్బందే..
హైవేపై బస్టాండ్ ఏర్పాటు చేయాలి
ఎదురుచూడాల్సి వస్తోంది
కామారెడ్డి మీదుగా గతంలో చాలా బస్సు సర్వీసులు నడిచేవి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్ వైపు.. అలాగే నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్‌నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే బస్సులు దాదాపు కామారెడ్డిలో ఆగేవి. అయితే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తగ్గించింది. నాన్‌స్టాప్ బస్సుల సంఖ్య పెరిగింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్య తగ్గడం, నాన్‌స్టాప్ బస్సులు కామారెడ్డిలో ఆగకుండా బైపాస్ మీదుగా వెళ్లిపోతుండడంతో ఇక్కడినుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ రూట్‌లో తూప్రాన్, మేడ్చల్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇక్కడినుంచి నేరుగా బస్సు సర్వీసులు లేకపోవడంతో ఆర్మూర్, బోధన్, ఆదిలాబాద్, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు వెళ్లడానికీ ఇబ్బందులు తప్పడం లేదు.
వచ్చేవి అరకొర.. ఆపై సీట్లన్నీ ఫుల్...
కామారెడ్డి బస్టాండ్‌లోకి ఇతర డిపోల బస్సులు అరకొరగానే వస్తున్నాయి. అవి నిండుగా వస్తుండడంతో నిల్చోవడానికీ ఇబ్బందిగా ఉంటోంది. రద్దీ సమయంలో మహిళలు, వృద్ధులు, విద్యార్థుల ఇబ్బంది వర్ణనాతీతం. ఆర్మూర్, ఆదిలాబాద్, కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్, బోధన్ డిపోలకు చెందిన బస్సులు కొన్ని మాత్రమే కామారెడ్డి పట్టణం మీదుగా హైదరాబాద్‌వైపు నడుస్తున్నాయి. ఆయా డిపోల బస్సులు చాలావరకు నాన్‌స్టాప్ పేరుతో బైపాస్ మీదుగా పరుగులు పెడుతున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఆర్మూర్, బోధన్, ఆదిలాబాద్, నిజామాబాద్, కోరుట్ల, మెట్‌పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చాలావరకు నాన్‌స్టాప్ బస్సులే ఉంటున్నాయి. కామారెడ్డి డిపోనకు చెందిన నాన్ స్టాప్ బస్సులు నిజామాబాద్, జేబీఎస్‌కు నడుస్తుంటాయి. అయితే అవి ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. ఆర్మూర్, బోధన్, ఆదిలాబాద్, కోరుట్ల, మెట్‌పల్లి వంటి రూట్లకు కామారెడ్డి డిపోనుంచి బస్సులు నడవవు. ఆయా డిపోల బస్సులు వస్తేనే ప్రయాణం సాగుతుంది.
పనుల మీద హైదరాబాద్‌కు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో కామారెడ్డికి రావాలంటే నరకం చూడాల్సిందే. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత బస్సులు తక్కువగా నడుస్తున్నాయి. అక్కడ వందల మంది వేచి చూస్తుంటారు. నిజామాబాద్, ఆదిలాబాద్, ఆర్మూర్ ప్రాంతాల నాన్‌స్టాప్ బస్సులే ఉంటాయి. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నాన్‌స్టాప్ బస్సులు ఎక్కి ఆర్మూర్, నిజామాబాద్‌కు టికెట్ తీసుకుంటున్నారు. బైపాస్‌పై పొందుర్తి, టేక్రియాల్ చౌరస్తాల వద్ద డ్రైవర్‌ను బతిమాలుకుని దిగుతున్నారు. కామారెడ్డి నుంచి రాత్రి పూట నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్ వైపు వెళ్లడానికి కూడా బస్సులు ఉండడం లేదు. దీంతో చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సి వస్తోంది.
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి బస్సులన్నీ వచ్చేలా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం హైవేపై బస్టాండ్ నిర్మించి, అక్కడ బస్సులు ఆగేలా చూడాలన్న డిమాండూ పెరుగుతోంది. ఇటీవల పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి హైవే బస్టాండ్ కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. హైవేపై బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
ఇతర డిపోలనుంచి రాష్ట్ర రాజధానికి
నాన్‌స్టాప్‌లే ఎక్కువ
జిల్లా కేంద్రం మీదుగా
అరకొరగానే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
సరిపడా బస్సులు లేక
ఇబ్బందిపడుతున్న జిల్లా ప్రయాణికులు
కామారెడ్డిలో అన్ని బస్సులు
ఆపాలని విజ్ఞప్తి
హైవేపై బస్టాండ్ ఏర్పాటుకు
పెరుగుతున్న డిమాండ్
తూప్రాన్‌కు ఎక్స్‌ప్రెస్‌లోనే వెళ్లాలి. వేరే బస్సులు తూప్రాన్‌కు వెళ్లవు. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో సీట్లు దొరకడం కష్టంగా ఉంది. ఒక్కోసారి నిల్చోవడానికీ ఇబ్బందిగా ఉంటోంది. వేరే డిపోల బస్సులు వస్తే సమస్య తీరుతుంది.
– సుధాకర్, ప్రయాణికుడు, కామారెడ్డి
జాతీయ రహదారి మీదుగా నాన్‌స్టాప్ బస్సులు నేరుగా వెళ్లిపోతున్నాయి. కామారెడ్డి పట్టణంలోపలికి రావడం లేదు. రాత్రి పూట హైదరాబాద్ నుంచి కామారెడ్డికి రావాలంటే ఇబ్బందిగా ఉంటోంది. హైవే మీద బస్టాండ్ ఏర్పాటు చేసి, బస్సులు ఆపేలా చూడాలి.
– పుట్ట మల్లికార్జున్, సామాజిక కార్యకర్త, కామారెడ్డి
హైదరాబాద్ వెళ్లడానికి ఒక్కోసారి గంటసేపు ఎదురు చూడాల్సి వస్తోంది. చాలా ఇబ్బంది అవుతోంది. ఎక్స్‌ప్రెస్‌లు ఎప్పుడో ఒకటి వస్తున్నాయి. నాన్‌స్టాప్ బస్సుల్లో చార్జీలు ఎక్కువ. అన్ని డిపోల బస్సులు కామారెడ్డి లోపలికి వస్తే ఏ ఇబ్బంది ఉండదు.
– రాజు, ప్రయాణికుడు, కామారెడ్డి


