● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి అనుబంధంగా పనిచేసే ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ఆధార్ నమోదు, వివరాల సవరణ తదితర సేవలు మరింత సులభంగా అందుతాయని అన్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పా టు చేస్తుండగా, కామారెడ్డి 12వ జిల్లాగా నిలిచిందన్నారు. సాధారణ కేంద్రాలతో పోలిస్తే ఇక్కడ ప్రత్యేక సేవలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఆధార్‌కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం, నిలిపివేసిన నంబర్ల పునరుద్ధరణ వంటి సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. గతంలో ఇలాంటి సేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయన్నారు. మండల ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో హెబ్సీబారాణి, ఈడీఎం ప్రవీణ్ పాల్గొన్నారు.


