● వైద్యాధికారులు, సిబ్బందితో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డిని ‘సురక్షిత్ ప్లస్’గా నిలపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్యాధికారులకు సూచించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసి కామారెడ్డిని ‘సురక్షిత్ జిల్లా’గా గుర్తింపు పొందింది. ‘నాకో’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ‘మొబిలైజేషన్ ఎయిడ్స్ రక్ష’ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ బాధితులను గుర్తించడం, వారికి చికిత్స అందించడం, ఔషధాలు వాడుతున్న వారిలో వైరల్ లోడ్ తగ్గించడం వంటి మూడు దశల లక్ష్యాలను జిల్లా అధిగమించింది. ఈ ఘనత సాధించినందుకు ‘నాకో’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా కలెక్టర్‌కు ప్రశంసాపత్రం పంపించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకట్ గురువారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం హెచ్ఐవీ నియంత్రణకు విశేష కృషి చేసిన డీఎంహెచ్‌వోతో పాటు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బందిని కలెక్టర్ సత్కరించి, అభినందనలు తెలిపారు. అధికారులు, సిబ్బంది ఇదే సమన్వయంతో పనిచేసి డిసెంబరు 1 నాటికి కామారెడ్డిని ‘సురక్షిత్ ప్లస్’ జిల్లాగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రదీప్, డీపీఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


