భిక్కనూరు: నేరాల నియంత్రణకు పోలీస్‌లు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. గురువారం ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేసి దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా చూడాలన్నారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట కామారెడ్డి డీఎస్పీ మదుసూదన్, భిక్కనూరు సీఐ నరేష్, ఎస్సై అనిల్ తదితరులున్నారు.
నాగిరెడ్డిపేట: చిరుతను తరిమేసేందుకు మాల్తుమ్మెద గ్రామస్తులు గురువారం టపాకాయలు పేల్చారు. పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. గ్రామ సమీపంలోని చెన్నకేశవుని గుట్టపై బుధవారం చిరుత సంచరించిన విషయం తెలిసిందే. నాగిరెడ్డిపేట ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్, డిప్యూటీ ఆర్‌వో రాఘవేందర్‌రావు సిబ్బందితో గ్రామానికి చేరుకొని చిరుత సంచారంపై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఒంటరిగా సంచరించవద్దని, చిన్నపిల్లలను, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కాగా గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన పలువురు యువకులు మూకుమ్మడిగా గుట్టపైకి చేరుకొని టపాకాయలను పేల్చారు. దీంతోపాటు పెద్దపెద్ద శబ్దాలు చేశారు. దీంతో చిరుత అక్కడినుంచి వెళ్లిపోయింది.


