నాగిరెడ్డిపేట: ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలోని చెట్లు ధ్వంసమయ్యాయి. 33 కేవీ విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మండలంలోని బంజార తండా నుంచి తాండూర్‌గేట్ వరకు జాతీయ రహదారి పక్కనున్న అటవీప్రాంతంలో చెట్లను నరికివేశారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డిపేట ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని నరికేసిన చెట్లను పరిశీలించారు. ట్రాన్స్‌కో సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చెట్లను నరికేసినవారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు.


