డీపీఆర్‌ లోపం.. రోజుకో ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

డీపీఆర్‌ లోపం.. రోజుకో ప్రమాదం!

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

● ఆరు నెలల్లో 12 మంది మృతి

● 60 మందికి గాయాలు

● 765డీ జాతీయ రహదారి డీపీఆర్‌ మార్చాలని ప్రజల వినతి

నస్రుల్లాబాద్‌: జాతీయ రహదారి నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డీపీఆర్‌ లోపంతోనే పదేపదే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాన్సువాడ నుంచి నస్రుల్లాబాద్‌ మధ్య 11 కిలోమీటర్ల దూరం ఉండగా, ఇక్కడ చేపడుతున్న 765 డీ జాతీయ రహదారి నిర్మాణ పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి.

ఆదమరిస్తే అంతే..

నస్రుల్లాబాద్‌–బాన్సువాడ మధ్య ఉన్న 765 డీ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రెండు పట్టణాల మధ్య దేశాయిపేట్‌, సోమేశ్వర్‌, దుర్కి, అంకోల్‌ క్యాంపు, నెమ్లి, కామిశెట్టిపల్లి, బొమ్మన్‌దేవ్‌ పల్లి క్రాస్‌ రోడ్డు గ్రామాలు ఉంటాయి. డీపీఆర్‌ ప్రకారం రోడ్డుకు రెండు వైపులా సర్వీసు రోడ్డు, మధ్యలో రెండు డ్రెయినేజీలు ఉన్నాయి. అయితే ప్రతి 1.5 కి.మీకు ఒక గ్రామం ఉండటంతో డ్రెయినేజీపై ఫుట్‌పాత్‌తోపాటు ఇనుప గ్రీల్స్‌ ఏర్పాటు చేశారు. బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్‌ రోడ్డు, నస్రుల్లాబాద్‌ బస్టాండ్‌, సోమేశ్వర్‌, దుర్కి, నెమ్లి గ్రామాల్లో మూల మలుపులు ఉన్నాయి. రహదారి కేవలం 10 మీటర్ల విస్తీర్ణంలో ఉండటంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా సాగుతున్నాయి. కాస్త ఆదమరిచినా, అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి. బాన్సువాడ– నస్రుల్లాబాద్‌ మధ్య 11 కి.మీ మేర సర్వీసు రోడ్డు మినహా మధ్యలో దారి దాదాపుగా పూర్తయి ఆరు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో దాదాపు 12 మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇవి కేవలం పోలీసుల రికార్డుల్లోనివి మాత్రమే. పలువురు రోడ్డు సైడ్‌ డ్రెయినేజీలో పడి, అదుపుతప్పి పడిపోయి మరణించినవి పోలీసుల దృష్టికి రాలేదు. అయితే ఇనుప గ్రీల్స్‌, రోడ్డు చిన్నగా కావడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నస్రుల్లాబాద్‌ మండల ప్రజలు, నాయకులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీపీఆర్‌లో మార్పులు చేసి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement