కొత్త హంగులు! | - | Sakshi
Sakshi News home page

కొత్త హంగులు!

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

క్రీడా ప్రాంగణానికి కొత్త హంగులు! స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతా... ఇండోర్‌ స్టేడియం...

క్రీడా ప్రాంగణానికి
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియానికి కొత్త హంగులు ఏర్పడుతున్నాయి. స్టేడియంలో ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇండోర్‌ స్టేడియాన్నీ నిర్మిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పడితే కామారెడ్డి స్పోర్ట్స్‌ హబ్‌గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వ్యాయామం చేస్తున్న క్రీడాకారులు

కామారెడ్డిలో ఇందిరాగాంధీ మినీ స్టేడియం నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005 ఏప్రిల్‌ 3న శంకుస్థాపన చేశారు. స్టేడియం నిర్మాణంతో వివిధ క్రీడల్లో శిక్షణ పొందడానికి, ఆడుకోవడానికి ఎంతో సౌకర్యం కలిగింది. ఇక్కడ నిత్యం వందలాది మంది వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌ చేస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అనేక మందికి ఉపయోగపడిన స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇటీవల భారీగా నిధులు మంజూరయ్యాయి. వాలీబాల్‌ గ్రౌండ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయి.

ఫ్లడ్‌ లైట్స్‌...

ఇందిరాగాంధీ స్టేడియం నలుమూలల్లో ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే లైట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. భిక్కనూరులోని ఎంఎస్‌ఎన్‌ ఫార్మా కాంపెనీ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.76 లక్షలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లడ్‌ లైట్ల ఏర్పాటుతో రాత్రి పూట కూడా ఆడుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే స్టేడియం ఆవరణలో రూ. 30 లక్షలతో టాయ్‌లెట్స్‌, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు.

విద్యార్థులు, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చూసేందుకు క్రీడలవైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు దశాబ్దాల కిందటే దివంగత సీఎం వైఎస్సార్‌తో మాట్లాడి కామారెడ్డిలో ఇందిరాగాంధీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాను. ఇప్పుడు ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేయించా. స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. వాలీబాల్‌ గ్రౌండ్‌, స్విమ్మింగ్‌పూల్‌ కోసం అవసరమైన నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తున్నా. కామారెడ్డి స్టేడియం క్రికెట్‌ క్రీడాకారులను తయారు చేయడానికి వేదికవుతుందన్న నమ్మకం ఉంది. దీనిని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

– షబ్బీర్‌ అలీ, ప్రభుత్వ సలహాదారు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ చొరవతో ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. 90 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తున్నారు. ఇందులో నాలుగు షటిల్‌ కోర్టులు, ఒక రైఫిల్‌ షూటింగ్‌ ఎరీనా, ఒక స్క్వాష్‌ కోర్టు, జిమ్‌, యోగా హాల్‌ నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఆయా క్రీడలపై ఆసక్తి ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

రూ. 76 లక్షలతో ఫ్లడ్‌ లైట్లు..

రూ. 8 కోట్లతో

ఇండోర్‌ స్టేడియం నిర్మాణం

షటిల్‌ కోర్టులు, రైఫిల్‌ షూటింగ్‌

ఎరీనా, స్క్వాష్‌ కోర్టు..

జిమ్‌తోపాటు యోగా కోసం గదులు

మారనున్న జిల్లా కేంద్రంలోని

ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement