కామారెడ్డి టౌన్ : విద్యార్థులు చట్టాలపై అవ గాహన పెంపొందించుకోవాలని జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ (గంజ్), జెడ్పీ బాలుర హైస్కూల్‌లలో ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’, సైబర్ భ ద్రతపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. ఎలాంటి వే ధింపులు, అనుచిత ప్రవర్తన ఎదురైనా భయ పడి మౌనంగా ఉండకూడదని, వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు పంచుకోవద్దని సూచించారు. అనంతరం సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించా రు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కోర్టు సిబ్బంది అనూష, శ్రవణ్ కుమార్, సాధన స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలో నవంబర్ 1వ తేదీన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ రాతపరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో బాన్సువాడ డివిజన్‌లో 2, కామారెడ్డి డివిజన్‌లో 5 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల అధికారిక వెబ్‌సైట్ http://bse. telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసు కోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్, బాల్‌పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్‌లతో నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మంగళవారం సందర్శించారు. కళాశాల భవనంతో పాటు నూతన క్రిటికల్ కేర్ బ్లాక్, నిర్మాణంలో ఉన్న నూతన భవనాలను పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీజీహెచ్‌ను నూతన భవనంలోకి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కామారెడ్డి టౌన్: జిల్లాలో రైతులు విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై నిబంధనల ప్రకారం మార్కెట్ ఫీజును కొనుగోలుదారులే చెల్లించా లని, రైతుల నుంచి ఎలాంటి రుసుమూ వసూ లు చేయబోమని జిల్లా మార్కెటింగ్ శాఖ అధి కారి (డీఎంవో) రమ్య తెలిపారు. మంగళవా రం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ని 10 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు నేరుగా లేదా మధ్య వర్తుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని, కొనుగోలు చేసిన సరుకు విలువపై ఒక శాతం మా ర్కెట్ ఫీజును వ్యాపారులే మార్కెట్ కమిటీల కు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రై తుల వద్ద నుంచి ఫీజు తీసుకుంటున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అనుమతులు లేకుండా వ్యాపారం చే స్తున్న దళారులు, వ్యాపారులు తక్షణమే మా ర్కెట్ కమిటీల నుంచి లైసెన్సులు పొందాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో బుధవారం ఉదయం నషా ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించనున్నట్టు రెడ్‌క్రాస్ సోసైటీ డైరెక్టర్ బాలు తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు మాదక రహిత భారత దేశం అంశంపై వ్యాసరచన, 10 గంటలకు ర్యాలీ, 11 గంటలకు గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు.


