కామారెడ్డి టౌన్ : విధి నిర్వహణలో ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన 4 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని స్థానిక జీఆర్ కాలనీ వద్ద ఎస్పీ రాజేశ్ చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జీఆర్ కాలనీ వద్ద మొదలైన ర్యాలీ హౌసింగ్ బోర్డు, నిజాంసాగర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా కళాభారతి వరకు సాగింది. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీ మధుసూదన్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


