● ‘సాగర్’లోకి 2,945
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● నాగమడుగు వద్ద నీటమునిగిన రోడ్డు
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నల్లవాగు మత్తడికి వరద పోటెత్తింది. మత్తడిలోకి 15 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అలుగుపైనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అచ్చంపేట వద్ద నాగమడుగు లోలెవల్ వంతెన నీటమునిగింది. అచ్చంపేట– నిజాంసాగర్ గ్రామాల మధ్య కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించాయి.
నిజాంసాగర్‌లోకి..
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం 2,945 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1,400.25 అడుగుల (11.622 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు.
దెబ్బతిన్న మక్కపంట
పెద్దకొడప్‌గల్: సముందర్ తండాలో గురువారం రాత్రి బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న నేలవాలింది. పంటను పరిశీలించి నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.


