లింగంపేట: వైకల్యం ఉన్న వారిపై వివక్ష చూపకుండా పెంచాలని జిల్లా న్యాయమూర్తి నాగరాణి కోరారు. మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో నిర్వహిస్తున్న ఫిజియోథెరఫీ కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ సేవా సదస్సులో పాల్గొని, విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో అంజల్‌రెడ్డి, హెచ్‌ఎం శోభారాణి, భవిత సెంటర్ ఇన్‌చార్జి అశ్విని, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది, సీఆర్పీలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని 15 రోజులలో పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మీసాన్‌పల్లి రైతు వేదికలో శుక్రవారం ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాల ఐకేపీ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలకు సంబంధించి ఇచ్చిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ వినోద్, ఏపీఎంలు రాంనారాయణగౌడ్, ప్రసన్నరాణి, వినోద్, దత్తు తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు పనుల పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.161 కోట్ల నిధు లు ఇవ్వాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. మంజీర నదిపై రూ. 475 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పనులకు భూసేకరణ కోసం రూ. 3.66 కోట్లు చెల్లించాలన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పు కోసం రూ. 35 లక్షలు విడుదల చేస్తే కొత్త డిజైన్ ప్రకారం పనులు జరుగుతాయని పేర్కొన్నారు.
మాచారెడ్డి: అప్రకటిత విద్యుత్ కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. మాచారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొంటూ రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రీఫేజ్ కరెంట్‌ను ఐదు నుంచి ఆరు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని, దాంతో పొలాలు నీరు పారక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే పంటలు పండక నష్టపోయి, అప్పుల పాలవు తామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాచారెడ్డి ఎస్సై విజయ్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.


