సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రైస్‌మిల్లర్లు సమ్మె చేస్తుండడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న మిల్లులకు తాళాలు పడ్డాయి. పది రోజులుగా ధాన్యపు కర్మాగారాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
వలస కార్మికులే అధికం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 450 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని మరాడించేందుకు అవకాశం ఉంది.జిల్లావ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లుల్లో సుమారు 20 వేలకు పైగా కార్మికులు వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే అధికంగా ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు జిల్లాలోని రైస్‌మిల్లులు, ధాన్యపు గోదాముల్లో పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడే ఉంటున్నారు. మిల్లుల్లో ధాన్యాన్ని ఆరబెట్టడం, మరపట్టించడం, సంచుల్లో నింపడం, గోదాముల్లోకి తరలించడం వరకూ పనులన్నీ చేస్తూ పొట్టనింపుకుంటున్నారు. అయితే పది రోజులుగా రైస్‌మిల్లర్లు సమ్మెకు చేస్తుండడంతో వీరికి ఉపాధి కరువైంది. జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లులన్నింటికీ తాళాలు పడగా, కార్మికులు చేసేదేమీ లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మిల్లులను ఎప్పుడు తెరుస్తారో, తమకు మళ్లీ పని ఎప్పుడు దొరుకుతుందోనని ఎదురుచూస్తున్నారు.
ముదురుతున్న పంచాయితీ
ప్రభుత్వం రైస్‌మిల్లులకు అప్పగించిన ధాన్యాన్ని సీఎమ్మార్ కింద మిల్లర్లు బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంది. ఈ విషయంలో ఏళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యం పెండింగ్‌లోనే ఉంటోంది. దీంతో సీఎమ్మార్ అప్పగించని మిల్లుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని మిల్లుల్లో ఇప్పటికే ధాన్యం మాయం కాగా సదరు యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఒత్తిళ్లు, దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మిలర్లు సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే, పది రోజులు గడిచినా ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య పంచాయితీ సద్దుమణగడం లేదు. పైగా ఈ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది.
నెలరోజుల్లో వరి కోతలు
జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంట మరో నెల రోజుల వ్యవధిలోనే చేతికి రానుంది. అక్టోబర్ నెలలోనే కోతలు ప్రారంభంకానున్నాయి. అయితే, మిల్లుల మూసివేత, సమ్మె కొనసాగింపు నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. మిల్లర్ల సమస్యలను పరిష్కరించి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
బోధన్ మండలం ఎరాజ్‌పల్లి సమీపంలోని రైస్‌మిల్లులో పనిలేక ఖాళీగా కూర్చున్న కార్మికులు
జిల్లాలో పది రోజులుగా మూతబడిన రైస్‌మిల్లులు
ప్రభుత్వ తనిఖీలు,
దాడులతో సమ్మెకు దిగిన మిల్లర్లు
కార్మికుల ఉపాధికి దెబ్బ
జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో
20 వేలకు పైగా కార్మికులు


