ఫైలు కదిలితేనే కార్యరూపం..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో సహకార సంఘాల విభజనకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగులో ఉండడంతో కొత్తగా సంఘాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 2005 లో విండోల విభజన, సర్దుబాట్లు జరిగాయి. కొత్త మండలాలు ఏర్పడి పదేళ్లవుతున్నా.. విభజన దిశగా అడుగులు పడలేదు. దీంతో కొన్ని మండలాల్లో సహకార సంఘాలే లేవు. ఈ నేపథ్యంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 55 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. అయితే ఆయా ప్రాంతాల రైతుల నుంచి కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తంగా 26 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రాగా.. వాటిని పరిశీలించిన అధికారులు నిబంధనల ప్రకారం పది సంఘాల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా పది చోట్ల సంఘాల ఏర్పాటు చేయాలని జిల్లా సహకార శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఫైలు ముందుకు కదలడం లేదు. దీంతో రైతుల ఆశలు నెరవేరడం లేదు.
ఎక్కడెక్కడ అంటే..
కామారెడ్డి మండలం మొత్తంలో ఒకటే సహకార సంఘం ఉంది. చిన్నమల్లారెడ్డి, గర్గుల్‌లలో సొసైటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాలతో పాటు రామారెడ్డి మండలంలోని కొన్ని గ్రామాలకు కలిపి మాచారెడ్డిలో ఒక్క సొసైటీనే ఉంది. కొత్తగా ఏర్పడిన పాల్వంచ కేంద్రంగా సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. రామారెడ్డి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో ఉండగా.. రామారెడ్డి కేంద్రంగా కొత్త సొసైటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. లింగంపేట సొసైటీ నుంచి భవానీపేట కేంద్రంగా కొత్త సొసైటీ ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించారు. గాంధారి మండలంలో మాతుసంగెం కేంద్రంగా సొసైటీని, జుక్కల్ మండలంలో ఖండేబల్లూర్ సొసైటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పిట్లం మండల కేంద్రంలో సొసైటీ లేదు. చిల్లర్గి సొసైటీ నుంచి పిట్లం కేంద్రంగా సొసైటీ ఏర్పాటుకు, బాన్సువాడ మండలం బోర్లం సొసైటీ పరిధిలో హన్మాజీపేట కేంద్రంగా కొత్తగా సొసైటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు.
కొత్త సొసైటీలు ఏర్పాటైతే సేవలు చేరువవుతాయని రైతులు ఆశిస్తున్నారు. పంటల సాగుకు సహకార సంఘాల ద్వారా విరివిగా రుణాలు లభిస్తాయి. స్వల్పకాలిక రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సంఘాలు దూరంగా ఉండడంతో పాటు పరిధి ఎక్కువగా ఉండి సరైన సేవలు అందడం లేదు. సొసైటీల విభజన జరిగితే సేవలు మరింతగా అందుతాయి. అందువల్లే తమ గ్రామాల పరిధిలో సంఘాలు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని కొత్త సంఘాలు ఏర్పాటు చేయడానికి ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.
కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరి నెలలు గడుస్తున్నా ఫైలు ముందుకు కదలడం లేదు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన విభజనే తప్ప.. తర్వాత సొసైటీల విభజన జరగలేదు. తమ ప్రాంతంలో సొసైటీ ఏర్పాటు చేయాలంటూ చాలా గ్రామాల నుంచి రైతులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ మహాజన సభలలో తీర్మానాలు కూడా చేస్తున్నారు. రైతుల డిమాండ్‌ను పరిశీలించిన ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని కోరింది. దీంతో జిల్లా సహకార అధికారులు సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అయితే ప్రభుత్వం సంఘాల ఏర్పాటు ఫైలును పెండింగులోనే పెట్టడంతో రైతుల ఆశలు నెరవేరడం లేదు.
జిల్లాలో కొత్తగా పది సహకార
సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
నెలలు గడుస్తున్నా ముందుకు
కదలని విభజన ఫైలు
ఆశగా ఎదురు చూస్తున్న రైతులు


