సమస్య పరిష్కరిస్తాం
● కొన్ని కాలనీల్లో నిరంతరం
వెలుగుతున్న వీధి దీపాలు
● పట్టించుకోని బల్దియా అధికారులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా తయారయ్యింది. పలు కాలనీల్లోని వీధి లైట్లు పగలు, రాత్రి లేకుండా నిరంతరం వెలుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రజాధనం వృథా అవుతోంది.
తొమ్మిది వేల వీధి దీపాలు..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులున్నా యి. మొత్తం 200 లకుపైగా కాలనీలు ఉండగా, వాటి పరిధిలో తొమ్మిది వేలకు పైగా వీధి దీపాలు ఉన్నా యి. వీటి నిర్వహణకు మున్సిపాలిటీ ప్రతి నెల రూ. 10 లక్షలకు పైగా ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ప్రధాన కూడళ్లతోపాటు, కాలనీలు, కీలక ప్రాంతాల్లో స్విచ్ఛాఫ్ చేసే నాథుడే కరువయ్యాడు. 26వ వార్డులోని వీక్లీ మార్కెట్‌లో నెల రోజులుగా 24 గంటలపాటు దీపాలు వెలుగుతున్నా అటువైపు మున్సిపల్ ఏఈ, వార్డు ఆఫీసర్ కన్నెత్తి కూడా చూడకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి ఉంది. పట్టణంలో 24 గంటలూ లైట్లు వెలిగే చోట్ల టైమర్లు, ఆటోమేటిక్ స్విచ్ బోర్డులు పాడైనా బాగు చేసే దిక్కు లేదు. ఆటోమేటిక్ టైమర్‌లో బ్యాటరీలు వేయాలని చెబుతున్నా ఏఈ పట్టించుకోవడం లేదని మున్సిపల్ ఎలక్ట్రీషియన్ ఆరోపిస్తున్నారు. ఇక శివారు కాలనీలతోపాటు పలు అంతర్గత వీధుల్లో బల్బులు మాడిపోయి వారాలు, నెలలు గడుస్తున్నా కొత్తవి వేయకపోవడం గమనార్హం. బల్దియా అధికారులు అధికారులు స్పందించి విద్యుత్ వృథాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ దీపాలు రాత్రి సమయంలోనే వెలిగేలా చర్య లు తీసుకుంటాం. అవసరమై న సామగ్రి కొనుగోలు చేసి సమస్యను పరిష్కరిస్తాం. సంబంధిత ఏఈలతో చర్చించి పాడైపోయిన బల్బులను మార్పిస్తాం.
– పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి


