● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై
వేర్వేరుగా సమావేశాల నిర్వహణ
కామారెడ్డి క్రైం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వలకు అందుబాటులో ఉన్న గోదాములు, ఇతర నిల్వ ప్రదేశాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు, తహసీల్దార్లు, డీటీ సీఎస్‌లు సంయుక్తంగా గుర్తించాలన్నారు.అనంతరం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో డిజిటల్ క్రాప్ సర్వేపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. పంటల నమోదును సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. క్రాప్ బుకింగ్‌నకు సంబంధించి ఫోన్‌కు వచ్చే మెస్సేజ్‌లను రైతులు సరిచూసుకోవాలని, పంటల నమోదులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే 72 గంటల్లోగా ఏఈవోను సంప్రదించి సరిచేయించుకోవాలని రైతులకు సూచించారు. ఆయిల్‌పాం సాగుపైనా సమీక్షించారు.
ఇళ్ల మంజూరు ప్రతిపాదనలు సమర్పించాలి
తాడ్వాయి, జుక్కల్, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్, డోంగ్లి మండలాలతోపాటు బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన ఫేజ్–2 మంజూరు ప్రతిపాదనలను బుధవారంలోగా సమర్పించాలని ఆదేశించారు. అర్హుల ఎంపిక విషయంలో క్షేత్ర పరిశీలన పక్కాగా చేపట్టాలన్నారు. గడువులోపు ప్రతిపాదనలు సమర్పించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజాపాలన దినోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
ఈనెల 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగనున్న ఈ వేడుకల్లో వేదిక, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్, ఇతర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్‌వై గిరి, డీఆర్వో పాండు, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, డీఏవో మోహన్‌రెడ్డి, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


