ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ చోరీ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ చోరీ ముఠా అరెస్టు

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

52 ట్రాన్స్‌ఫార్మర్లను

కొల్లగొట్టిన నిందితులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌ చంద్ర

కామారెడ్డి క్రైం: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో 52 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్‌ వైర్‌ చోరీ చేసిన అంతర్‌ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు మండల పరిధిలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఐదు నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌, వైరు, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు భిక్కనూరు ప్రాంతంలో మొత్తం 29, మెదక్‌ జిల్లా పరిధిలో 23 చోట్ల నమోదయ్యాయి. దీంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితులను గుర్తించారు. మరోసారి చోరీ చేసేందుకు భిక్కనూరు సమీపంలోని పరివార్‌ హోటల్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను మేడ్చల్‌కు చెందిన బల్జీర్‌ సింగ్‌, రూప్‌సింగ్‌, లకన్‌ సింగ్‌లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నాడన్నారు.

ముఠా సభ్యులు.. అన్నదమ్ములు..

అంతర్‌ జిల్లా ముఠా సభ్యులు నలుగురూ సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. నిందితులు గతంలో జైలుకు వెళ్లి వచ్చారని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. బల్జీర్‌ సింగ్‌పై తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దోపిడీ, రూప్‌సింగ్‌పై మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2 దొంగతనం, ఒక దోపిడీ కేసు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 కిలోల కాపర్‌ వైరు, రాడ్లు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు, బైక్‌, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌, సీఐలు నరేశ్‌, సంతోష్‌ కుమార్‌, ఎస్సైలు అనిల్‌, మహేశ్‌, వెంకట్రావు, గంగారెడ్డి, ఐటీకోర్‌ సిబ్బంది శ్రీనివాస్‌, బాలకృష్ణ, శ్రీకాంత్‌, కిషన్‌, గణేశ్‌, రమేశ్‌, శేఖర్‌, లక్ష్మీకాంత్‌, చేతన్‌, స్వామి, రాజేందర్‌, మైసయ్య, మహేందర్‌లను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement