● ఓవైపు కోతలు..
మరోవైపు లోఓల్టేజీ సమస్య
● నీరందక దెబ్బతింటున్న పంటలు
● రోడ్డెక్కుతున్న అన్నదాతలు
బోర్లు, బావుల మీద ఆధారపడి పంటలు పండిస్తున్న రైతాంగాన్ని కరెంటు సతాయిస్తోంది. లోఓల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయి. విద్యుత్ కోతలతో మడులు తడవక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలో బోర్లు, బావులకు సంబంధించి 1.18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటి కింద మూడు లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో సింహ భాగం వరి పంటదే.. వ్యవసాయానికి ఇటీవలివరకు వేకువజామున 5 గంటలకు కరెంటు సరఫరా మొదలై సాయంత్రం వరకు ఇచ్చేవారు. రెండు మూడు రోజులుగా 6.30 గంటల నుంచి 7 గంటల సమయంలో మొదలవుతుంది. మధ్యమధ్యలో కోతలు విధిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే కరెంటు సరఫరా అవుతోంది. దీంతో పొలాలు సరిగా పారడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాటిమాటికీ కరెంటు పోయివస్తుండడంతో స్టార్టర్లు మొరాయిస్తున్నాయని, మోటార్లు కూడా దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
కీలక సమయంలో..
ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాలు గతి తప్పాయి. తొలుత మురిపించి నెలన్నర కాలం పాటు ముఖం చాటేసిన వరుణుడు నెలక్రితం కరుణించడంతో జిల్లాలో వాగులు పొంగాయి. ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరింది. కొన్ని ప్రాంతాల్లో చెరువులు అలుగులెల్లాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో కొద్దిమేర నీరు వచ్చింది. అయితే పొరుగు జిల్లాల కన్నా కాస్త మెరుగ్గానే ఉండడంతో రైతులు ఆలస్యంగానైనా వరి నాట్లు వేశారు. వరి ఎదుగుతున్న సమయంలో నీరు పుష్కలంగా అందించాల్సి ఉంటుంది. కానీ ఇదే సమయంలో కరెంటు సమస్య తలెత్తడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నీరందకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడుతుందని, తద్వారా దిగుబడి కూడా దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


