ఎల్లారెడ్డి: పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్‌హాల్‌లో డబుల్ బెడ్‌రూంలకు సంబంధించిన లక్కీడ్రా కార్యక్రమాన్ని గురువారం ఆర్డీవో ప్రభాకర్ నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 300 డబుల్ బెడ్‌రూంలను మూడేళ్ల క్రితం నిర్మించారు. వీటిలో 259 లబ్ధిదారులకు గతంలో లక్కీడ్రా ద్వారా అందించారు. మిగిలిపోయిన 41 డబుల్ బెడ్‌రూంలకు సంబంధించి సర్వే నిర్వహించి వీరిలో 70 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 5 దివ్యాంగులకు, 2 గిరిజనులకు డబుల్‌బెడ్‌రూంలను రిజర్వేషన్ కేటాయించగా 34 డబుల్ బెడ్‌రూంలను జనరల్ కేటగిరిలో లక్కీడ్రా నిర్వహించారు. మిగితా వారికి సైతం విడతల వారీగా డబుల్ బెడ్‌రూంలను ప్రభుత్వం అందిస్తుందని అధికారులు సూచించారు. లక్కీడ్రా నిర్వాహణ కేంద్రానికి చాలా మంది తరలిరావడంతో అర్హుల జాబితాలో పేరున్న వారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, డీటీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహసీల్ కార్యాలయం ముందు నిరసన..
డబుల్‌బెడ్ రూంలు రాని వారు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డబుల్ బెడ్‌రూంలను తమకు సైతం కేటాయించాలని విన్నవించారు. కార్యాలయానికి చేరుకున్న తహసీల్దార్ విడతలవారీగా అందరికి ఇళ్లు వస్తాయని సర్ది చెప్పడంతో వారు అక్కడి నుంచి నిష్క్రమించారు.


