తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

Sep 10 2026 1:03 AM | Updated on Sep 10 2026 1:03 AM

అప్రమత్తతతో వ్యవహరించాలి

మద్నూర్‌ మండలంలో వరుస చోరీలతో భయం

ఆందోళన చెందుతున్న స్థానికులు

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా దుండగులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈనెల 4న మండల కేంద్రంతోపాటు మేనూర్‌లో ఒకేరోజు ఏడిళ్లలో దుండ గులు చోరీలకు పాల్పడ్డారు. సుమారు 25.8 తులాల బంగారం, 84 తులాల వెండి, రూ.1.78 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

రెక్కీ నిర్వహించి..

దొంగలు పక్కా సమాచారంతోనే మద్నూర్‌, మేనూర్‌లోని ఏడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పగలంతా రెక్కి నిర్వహించి తాళాలు ఉన్న ఇళ్లను గుర్తించి దొం గతనాలకు పాల్పడ్డారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు సైతం చోరీకి గురవుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్‌, డోంగ్లీ మండలాల్లో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాల ఘటనలు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లడం లేదని తెలుస్తోంది.

అవగాహన అవసరం..

ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తే చోరీల భయం ఉండదని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటికి తాళం వేయడంతోపాటు పక్కనే ఉన్న ఇంటివారికి తాము ఎన్ని రోజులు రామో తెలియజేయాలంటున్నారు. వారిని ఎప్పటికప్పుడు ఇంటిని గమనించాలని కోరాలి. అవసరమైతే వారికి తమ ఫోన్‌నంబర్‌ ఇవ్వాలి. అలాగే సమీప పోలీస్‌స్టేషన్‌కు తాము ఊరు వెళ్తున్నట్టు సమాచారం ఇవ్వాలి. దాంతో పోలీసులు ఆ ఇంటికి ప్రతిరోజు బీట్‌ కానిస్టేబుళ్లను పంపుతారు. ఇలా అవగాహన కలిగి ఉంటే ప్రయాణాలు ఎక్కడికై నా చేయవచ్చు. వేరే ఊరు వేళ్లేవారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు లాక్‌ అలారం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో తాళం వేసిన అనంతరం ఈ అలారం ఏర్పాటు చేస్తే ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే అలారం వెలుగుతుంది. దీంతో సమీపంలోని ప్రజలు గుర్తించి అక్కడికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఇళ్ల వద్ద నైట్‌ మోడ్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరం జరిగిన తీరు తెలియడమే కాకుండా పోలీసులకు దొంగలను త్వరగా పట్టుకునే వీలుంటుంది.

వేరే గ్రామాలకు వెళ్లేవారు వారి ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలి. ప్రతిరోజు ఆయా ఇళ్లవద్ద గస్తీ ఏర్పాటు చేస్తాం. అనుమానితులు, అపరిచిత వ్యక్తులు తారసపడితే వెంటనే ప్రశ్నించాలి. అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలి. అప్రమత్తతతో వ్యవహరిస్తే నేరాలు అదుపులోకి వస్తాయి. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించగలుగుతాం.

– మోహన్‌రెడ్డి, ఎస్సై, మద్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement