కామారెడ్డి రూరల్: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రూరల్ సీఐ శ్రీధర్‌గౌడ్ సూచించారు. బుధవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో గణేశ్ మండపాల నిర్వహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్‌ఐ రంజిత్, సర్పంచ్ భీమయాల నీలమ్మ రాజు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, మాజీ సర్పంచ్‌లు రామా గౌడ్, ఆనందరావు, గ్రామ పోలీసు అధికారి శ్రీకాంత్, గణేశ్ మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు పరిధిలో గల సరంపల్లి గ్రామంలో బుధవారం కౌన్సిలర్ నిట్టు గంగాధర్ సహకారంతో ఏర్పాటు చేసిన 7 సీసీ కెమెరాలను రూరల్ సీఐ శ్రీధర్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, కౌన్సిలర్ గంగాధర్, వార్డు ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
వినాయక మండపాలకు అనుమతి తప్పని సరి
బాన్సువాడ : వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని బీర్కూర్ ఎస్సై రాములు అన్నారు. బుధవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వినాయక మండపాల నిర్వాహకులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. సర్పంచి ధర్మతేజ, మైనార్టీ మత పెద్దలు ఉన్నారు.
నెమ్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన సదస్సు
నస్రుల్లాబాద్: మండలంలోని నెమ్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ పేరిట మోసాలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి నేతృత్వంలోని పోలీస్ కళాబృందం మాటలు, పాటల ద్వారా విద్యార్థులను చైతన్యపర్చారు. షీ టీం సిబ్బంది, హెచ్‌ఎం దుర్గబాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


