కామారెడ్డి టౌన్ : వినాయక చవితి నవరాత్రులు, నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులు, పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణంలోని వినాయక మండపాల పరిసరాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రధానంగా విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన మార్గాల్లో గుంతలు పూడ్చి రహదారులను సిద్ధం చేయాలని, అవసరమైన చోట్ల నూతన వీధి దీపాలను అమర్చాలని సూచించారు. నిమజ్జన వేదికల వద్ద నిరంతర తాగునీటి సరఫరా, క్రేన్లు, వాహనాల కేటాయింపు, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. వినాయక చవితి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసార్ల గోదావరి, కమిషనర్ టి. పర్వతాలు, పట్టణ సీఐ నరహరి, ఆయా శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆగమనంకు ఆర్భాటం వద్దు
నాగిరెడ్డిపేట : గణేశ్ ఉత్సవాలలో భాగంగా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం ఆగమనం పేరిట ఎలాంటి ఆర్భాటాలు చేయవద్దని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొర్కొన్నారు. నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన పలురికార్డులను పరిశీలించారు. దీంతోపాటు స్టేషన్ పరిధిలోని కేసుల వివరాలను ఎస్సై భార్గవ్‌గౌడ్‌ను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలకు డీజేలకు ఎలాంటి అనుమతులులేవన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలో మండపాల నిర్వాహకులతో శాంతికమిటీ సమావేశాలు జరుపనున్నట్లు ఆయన చెప్పారు.


