నాణ్యమైన వైద్య సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

Sep 10 2026 1:03 AM | Updated on Sep 10 2026 1:03 AM

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి సమస్యల సాధనకు ఎస్‌జీటీలు ఏకం కావాలి జీపీ భవన నిర్మాణానికి భూమి పూజ అటవీ శాఖ అధికారుల తనిఖీలు

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత ప్రమాణాల మేరకు పూర్తి చేసి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ జె.వెంకటి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ హాల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ, వ్యాక్సినేషన్‌, క్షయ, అసంక్రమిత వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారిని గుర్తించేందుకు ముమ్మరంగా స్క్రీనింగ్‌ నిర్వహించి, వారికి క్రమం తప్పకుండా చికిత్స, ఫాలోఅప్‌ అందించాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కచ్చితత్వంతో నమోదు చేయాలని, పీహెచ్‌సీల పనితీరు ఆధారంగానే జిల్లా ఆరోగ్య సూచికలు ఉంటాయని స్పష్టం చేశారు. వైద్యాధికారులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజు, ప్రోగ్రామ్‌ అధికారులు, పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: పెండింగ్‌ సమస్యల సాధనకోసం ఎస్‌జీటీలు ఏకం కావాలని ఎస్‌జీటీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హన్మాజీపేట్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్‌ చేశారు. జీవో 317ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్‌జీటీలకు ఓటుహక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రధానోపాధ్యాయులు రమేష్‌, ఉపాధ్యాయులు ముజమ్మిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్‌

సినీఫక్కీలో ఎత్తుకెళ్లిన అమ్మాయి

కుటుంబ సభ్యులు

జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్‌ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్‌ 15 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సీతారాంపల్లికి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్‌ కావడంతో ప్రశాంత్‌తోనే పంపించారు. నాటి నుంచి ప్రశాంత్‌, కావ్య అంతర్గాంలో ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్‌ తల్లి భారతమ్మపై దాడి చేసి కావ్యను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై భారతమ్మ జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

లింగంపేట : మండలంలోని మాలపాటి గ్రామంలో బుధవారం నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణానికి మార్కౌట్‌ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ అశ్విని, ఉపసర్పంచ్‌ సాయిలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

98 రకాల పక్షులు స్వాధీనం

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని మల్లారం, మాలపల్లి ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. మాలపల్లిలో ఉన్న ఓ అక్వేరియం, పెట్‌ దుకాణంలో అక్రమంగా ఉంచి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 98 రకాల పక్షులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్‌ కలీం, సయ్యద్‌ బిన్‌ ఖాలీద్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పక్షులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement