సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం, సొంత ఫోన్లు తీసుకొని చెక్ చేయడం, ఏదో ఒక కారణంతో వేధిస్తున్న ఆ ఏపీఎంతో వేగలేమంటూ గ్రామ సంఘం సహాయకులు (వీవోఏ) 24 మంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి(డీఆర్డీవో)కు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసి పది రోజులైనా సదరు ఏపీఎంపై విచారణ చేపట్టకపోవడంతో వీవోఏలు ఆవేదన చెందుతున్నారు. మాచారెడ్డి మండలానికి ఏపీఎంగా పనిచేస్తున్న వ్యక్తిపై మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 24 మంది వీవోఏలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక అధికారిపై కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినా విచారణ జరపకుండా తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే వీవోఏలను ఏదో ఒక కారణం చెబుతూ వేధిస్తున్నాడని వీవోఏలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెర్ప్ టీం వచ్చినప్పుడు లంచ్, స్నాక్స్ అన్నీ తమను అరేంజ్ చేయమని ఆదేశించాడని తెలిపారు. తమ ఫోన్‌లు తీసుకొని చెక్ చేస్తూ, వాళ్లతో ఎందుకు ఫోన్ మాట్లాడావు, వీళ్లతో ఎందుకు మాట్లాడావంటూ ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొన్నారు. గ్రామ సంఘం సభ్యులందరి ఎదుట కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఆయన చెప్పినట్టు వింటే సరి, లేదంటే ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొన్నారు. మీటింగ్‌లో చర్చించాల్సిన అంశాలను పక్కనపెట్టి అనవసర విషయాలతో కాలయాపన చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. వ్యక్తిగత విషయాల్లోనూ తలదూరుస్తూ ఇబ్బంది పెడుతున్న ఆ ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తనకు జిల్లా అధికారుల అండ ఉందంటూ సదరు ఏపీఎం తమపై దురుసుగా మాట్లాడుతున్నాడని పలువురు వీవోఏలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక అధికారిపై ఫిర్యాదు వచ్చినప్పుడు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు అధికారికే వంత పాడేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలోనూ ఆ ఏపీఎంపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తాము చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వీవోఏలు కోరుతున్నారు.
వీవోఏలకు వేధింపులు
సొంత ఫోన్‌లు చెక్ చేస్తున్నాడు
అన్ని విషయాల్లో
తలదూరుస్తున్నాడు
డీఆర్‌డీవోకు 24 మంది ఫిర్యాదు
పది రోజులైనా విచారణ చేపట్టని అధికారులు


