నిజామాబాద్ జిల్లాలో 75.6 శాతం, కామారెడ్డిలో 77.09 శాతం అడ్మిషన్లు
ఖలీల్‌వాడి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం దోస్త్ అన్ని దశలు పూర్తయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. నిజామాబాద్ జిల్లా పరిధిలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 4,620 సీట్లు ఉండగా, 3,493 మంది విద్యార్థుల చేరికతో 75.6 శాతం అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇంకా 1,127 ఖాళీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 4,200 సీట్లు ఉండగా, 3,238 మంది విద్యార్థులు (77.09 శాతం) ప్రవేశం పొందారు. 962 ఖాళీలు ఉన్నాయి. నిజామాబాద్ లో అత్యధికంగా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 1,860 సీట్లకు 1,837 మంది చేరారు. కామారెడ్డిలో ని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1,440 సీట్లకు 1,304 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
ప్రయివేటుకు గడ్డుకాలమే..
తెలంగాణ వర్సిటీ పరిధిలోని ఉమ్మ జిల్లాల్లో మొత్తం 52 ప్రయివేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో 36వేలకు పైగా సీట్లు ఉండగా, దోస్త్ అని విడతల్లో కలిపి సుమారు 13 వేల మంది విద్యార్థులు మాత్రమే చేరారు. తొమ్మిది కళాశాలల్లో మూడో విడత వరకు అడ్మిషన్లు కాలేదు. అయితే, ప్రయివేటు కాలేజీల్లో పీజీతోపాటు యూజీ విద్యార్థులు పూర్తిస్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటేనే వర్సిటీకి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అఫ్లియేషన్, పరీక్షలు, సప్లమెంటరీ వివిధ రకాల ఫీజులు సమాకూరుతాయి. ఈసారి అడ్మిషన్లు తగ్గడంతో ప్రయివేటు కళాశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు సిబ్బందిని తగ్గిస్తున్నాయి. మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు, ప్రస్తుతం సీట్ల భర్తీ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు అధిక శాతం మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా విద్యాశాఖ పరిధిలోని యూజీసీ స్వయంప్రతిపత్తి (అటానమస్) కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.
నిష్పక్షపాతంగా అడ్మిషన్లు
దోస్త్ ప్రక్రియ ద్వారా నిష్పక్షపాతంగా, మెరిట్ ఆధారంగా విద్యార్థులు ఎంచుకున్న వివిధ కోర్సులు, కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ఎన్‌సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగుల కేటగిరీలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పారదర్శకతతో ప్రవేశాలు కల్పించారు.
– ప్రొఫెసర్ విజయ్ కుమార్,
ప్రిన్సిపల్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామారెడ్డి
విశ్వాసమే పెంచింది
ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విశ్వాసం పెరగడంతో ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత (ఏఈడీపీ) కోర్సులలో కూడా విద్యార్థులు ఉత్సాహంగా చేరారు. ప్రభుత్వ సంకల్పం, ఉన్నతాధికారుల నిబద్ధత, అధ్యాపక సంఘాల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ ఫలితంగా దోస్త్ ప్రక్రియ ప్రభుత్వ కళాశాలలకు సరికొత్త శోభను తీసుకొచ్చింది.
– ప్రొఫెసర్ పి రామ్మోహన్ రెడ్డి, ప్రిన్సిపల్, జీజీ కళాశాల నిజామాబాద్.
99 శాతం ప్రవేశాలతో
జీజీ కాలేజీ టాప్..
90.55 శాతం అడ్మిషన్లతో ద్వితీయ స్థానంలో కామారెడ్డి ఆర్ట్స్ కాలేజీ
వెలవెలబోతున్న ప్రయివేట్ డిగ్రీ
కళాశాలలు.. 64 శాతం సీట్లు ఖాళీ


