దోమకొండ: ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయాలని కోరుతూ గురువారం రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ దివ్యను కలిసి వినతిపత్రం అందజేసినట్లు సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, సంఘమేశ్వర్ గ్రామ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్‌రావ్ తెలిపారు. రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షక్షుడు భూమన్న యాదవ్‌తో కలిసి పంచాయితీ రాజ్ కమిషనర్‌ను కలిసి సన్మానించి, 14 అంశాలపై వినతిపత్రంలో పేర్కొన్నామని తెలిపారు. ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేయడం, సర్పంచ్‌లకు గౌరవ వేతనం పెంచాలని కోరామన్నారు.
పెద్దకొడప్‌గల్: మండల కేంద్రంలోని సర్వే నంబర్ 48లో ప్రభుత్వ భూమి కబ్జాపై శుక్రవారం తహసీల్దార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ,సర్వే నిర్వహించారు. ఈసర్వే నంబర్‌లో రికార్డుల ప్రకారం 19 ఎకరాల 6 గుంటల భూమి ఉండాల్సి ఉంది.ఇందులో 10 ఎకరాల 20 గుంటలు అసైన్డ్ కింద కేటాయించబడింది.ఎన్‌హెచ్ 161 రహదారికి ఎకరం 20 గుంటల భూమి పోయింది. మిగిలిన సమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందనే దానిపై అధికారులు ప్రాథమికంగా పరిశీలన జరిపారు. విచారణ పూర్తయిన వెంటనే పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. సర్వేయర్ అహ్మద్ బీ ఆర్‌ఐ శ్రీరామ్ పటేల్,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: తనకు న్యాయంగా వస్తున్న పింఛన్‌ను కుట్రపన్ని కొందరూ రాకుండా చేశారని వెంటనే తనకు పింఛన్ వచ్చెలా చూడాలని ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఈఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గొల్ల రాములు మూర్ఛ వ్యాధితో బాధపడే తనకు గతంలో పింఛన్ రెగ్యులర్‌గా వచ్చేదని కొన్నినెలలుగా సదరం సర్టిఫికెట్ లేదనే నెపంతో పింఛన్ రాకుండా కొందరూ కుట్ర చేశారని తనకు పింఛన్ మంజూరు చేయాలంటూ గొల్ల రాములు వాటర్ ట్యాంక్ పై నుంచి దూకుతానంటూ హెచ్చరించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు,గ్రామస్తులు రాములును సముదాయించి వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దించారు. ఇటీవల గ్రామసభ జరిగిన రోజు కూడా గొల్ల రాములు తనకు పించన్‌ను కొనసాగించాలంటూ చెట్టుపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు సముదాయించి కిందకు దించారు.


