ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల వివరాలు..
● కట్టడి చేస్తున్నా తగ్గని రోడ్డు ప్రమాదాలు
● అవగాహన కల్పిస్తున్నా
మారని వాహనదారులు
● రోజుకొకరు చొప్పున మృత్యువాత
ఈనెల 15న నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పిట్లంకు వెళ్లారు. వారు బైకుపై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. వారిద్దరు వరుసకు బావ బావమరుదులు.
జూన్ 26న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన ముగ్గురు దోస్తులు కామారెడ్డి నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తున్నారు. మాచారెడ్డి మండలం గన్‌పూర్(ఎం) గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరుసటి రోజు మరొకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 21న ఇంకొకరు మృతిచెందారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగని రోజులుండడం లేదు. జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులే కాకుండా గ్రామీణ రహదారులపైనా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 161వ నంబరు జాతీయ రహదారిపై చాలా చోట్ల రాంగ్ రూట్లో వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు దాటే క్రమంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నచిన్న పొరపాట్ల కారణంగా జరిగే ప్రమాదం మొత్తం కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేస్తోంది. త్వరలో వెళ్లాలన్న ఆలోచనతో వేగంగా వాహనాలు నడుపుతుండడంతో పలువురు గమ్యం చేరకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు నడిపేటపుడు కనీస నియమాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ట్రాఫిక్ రూల్స్ పాటించక..
రహదారి భద్రత విషయంలో కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి వాటిని సరిచేస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నవారు కొందరైతే, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నవారు మరికొందరు.. అధికారులు అవగాహన కల్పిస్తున్నా, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా యాక్సిడెంట్లు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సంవత్సరం ప్రమాదాలు మరణాలు క్షతగాత్రులు
2025 454 225 443
2026(జూన్) 297 160 254
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తోంది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో దొరికినవారికి జరిమానాలతో పాటు జైలుశిక్షలూ పడుతున్నాయి. అయినప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడిపేవారు తగ్గడం లేదు. మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది మారడం లేదు. పోలీసుల తనిఖీలు జరుగుతాయన్న ఉద్దేశంతో రూట్లు మార్చి వెళుతున్నారు.


