జొన్నల పైసలు వచ్చేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

జొన్నల పైసలు వచ్చేదెప్పుడో?

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

జొన్నల పైసలు వచ్చేదెప్పుడో?

ప్రభుత్వానికి నివేదించాం

రెండు నెలలు గడిచాయి

కామారెడ్డి క్రైం : యాసంగిలో జొన్నలు పండించిన రైతులకు ఖరీఫ్‌ పెట్టుబడులకు ఇబ్బందులు తప్పడం లేదు. జొన్నలను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించిన రైతుల ఖాతాల్లో నెలలు గడుస్తున్నా డబ్బులు జమ కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన జొన్నలకు రూ.225 కోట్లు రావాల్సి ఉంది. అతి తక్కువ మంది రైతులకు మాత్రమే ఇప్పటివరకు డబ్బులు జమ అయ్యాయి.

64 వేల టన్నులు..

పక్షుల తాకిడి, ధర తక్కువగా ఉండటం లాంటి కారణాలతో గతంలో జిల్లాలో జొన్నసాగు తక్కువగా ఉండేది. 20 వేల ఎకరాలకు మించి జొన్న పంట సాగులోకి వచ్చేది కాదు. అలాంటిది గడిచిన మూడేళ్లుగా జొన్న సాగు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అధిక దిగుబడులను వచ్చే వంగడాలు, మంచి ధర, పక్షల తాకిడి తగ్గిపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లాంటి అనుకూల పరిస్థితులు కలగడంతో జొన్నసాగుపై రైతులు దృష్టిసారించారు. 2024–25 యాసంగిలో 71,104 ఎకరాల్లో జొన్న సాగులోకి రాగా, గతేడాది యాసంగిలో 87,943 ఎకరాల్లో రైతులు జొన్నలు పండించారు. క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం జిల్లాలో మొత్తం 53 జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత మే నెల నుంచి జూన్‌ వరకు కొనుగోళ్లు నిర్వహించగా, మొత్తం 64,004 టన్నుల జొన్నలను సేకరించారు. వాటి విలువ రూ.240 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.15 కోట్ల వరకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మిగిలిన రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. సకాలంలో డబ్బులు జమకాక ఖరీఫ్‌ సాగుకోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు.

జొన్నలు విక్రయించిన రైతులందరి వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. కొందరికి డబ్బులు పడ్డాయి. ఇంకా చాలామంది రైతులకు రావాల్సి ఉంది. నిధుల విడుదల షెడ్యూల్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులు ఆందోళన చెందొద్దు.

– క్రాంతి, డీఎం, మార్క్‌ఫెడ్‌, కామారెడ్డి

నేను జొన్నలు విక్రయించి రెండు నెలలు గడిచింది. దాదాపు లక్షన్నర వరకు డబ్బులు రావాల్సి ఉంది. ఇంకా జమ కాలేదు. ఖరీఫ్‌ పెట్టుబడులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి.

– విఠల్‌, రైతు, పెద్దకొడప్‌గల్‌

బకాయిలు రూ.225 కోట్లు

నెలలు గడుస్తున్నా ఖాతాల్లో

జమకాని డబ్బులు

నిధుల విడుదల నిలిపివేసిన సర్కారు

పెట్టుబడులకు ఇబ్బందులు

పడుతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement