కామారెడ్డి టౌన్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటన, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టులను ఖండిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలిపారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో విద్యార్థులు పరీక్షలపై నమ్మకం కోల్పోయారన్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల హక్కులు, విద్యార్థుల భవిష్యత్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్, నాయకులు శ్రీనివాస్, రాజు, భీమ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.


